ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్షిత నీటి పథకాలకు గ్రహణం... వేల మందికి శాపం! - కర్నూలు జిల్లా తాజా వార్తలు

అక్కడి ప్రజల గొంతు తడవాలంటే వాగులు, వంకల్లో చెలమ నీరే దిక్కు. కొందరు పొలాల నుంచి బోరు నీరు తెచ్చుకుంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి రక్షిత తాగునీటి పథకాలు మంజూరయ్యాయి. కానీ ప్రభుత్వ అలసత్వంతో వాటికి నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా 20కి పైగా గ్రామాల గొంతులెండుతున్నాయి. కర్నూలు జిల్లాలో రూ.28.70 కోట్ల నిధులతో చేపట్టిన పథకాలు అలంకారప్రాయంగా మిగిలిన వైనంపై ప్రత్యేక కథనం.

Kurnool district
Kurnool district

By

Published : Dec 11, 2020, 8:41 PM IST

కర్నూలు జిల్లాలో 20కి పైగా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకల్లో చెలమ నీటితో గొంతు నింపుకుంటున్నారు. జిల్లాలోని పల్లెల్లో దాహార్తి తీర్చేందుకు 2015-16లో రక్షిత మంచి నీటి పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిడుతూరు పరిధిలోని తలముడిపి, కొత్తపల్లి మండలం గుమ్మడాపురం వద్ద కోట్ల రూపాయల అంచనాలతో రెండు పథకాలు ప్రారంభించారు. తలముడిపి పథకానికి అలగనూరు జలాశయం నుంచి, గుమ్మడాపురం పథకానికి కృష్ణానది నుంచి నీటిని అందించాలి. అక్కడ శుద్ధి చేసి పల్లెలకు తాగునీటిని సరఫరా చేయాలని అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ రెండు పథకాల ద్వారా 20కి పైగా గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది.

15 వేల మందికి తీరని కష్టాలు

అలగనూరుతో పాటు మరో తొమ్మిది గ్రామాలకు తాగు నీరు ఇచ్చేందుకు 14.50 కోట్ల రూపాయలతో తలముడిపి రక్షిత పథకాన్ని చేపట్టారు. ఆ తర్వాత పనులు ప్రారంభం కాగానే ఉప్పలదడియ, మాసపేట రెండు గ్రామాలను ఈ పథకంలో కలిపారు. గుత్తేదారునికి ఇప్పటివరకు 9 కోట్ల రూపాయల వరకు చెల్లించారు. 2018 నాటికి పూర్తి కావాల్సిన పథకం నిధులు అందక జాప్యమైంది. జీఎస్టీ పెరగడంతో వ్యయాన్ని రూ.17 కోట్లకు పెంచి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇంకా నిధులు విడుదల కాలేదు. ఈ పథకం అక్కరకు రాకపోవటంతో కొన్నేళ్లుగా 15వేల మంది ప్రజలకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఖాజీపేట, మజీరా గ్రామ వాసులు వాగుల్లో చెలమల నీళ్లు తాగాల్సి వస్తోంది. తాగునీటి సమస్యపై పలుసార్లు నిరసన చేయడంతో ట్రాక్టర్‌ ట్యాంకర్‌ ద్వారా నీరు అందిస్తున్నారు. అదేవిధంగా కడుమూరు, దేవనూరు వంటి గ్రామాల్లో నీటి కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.

భయపెడుతోన్న ఫ్లోరైడ్ భూతం

మరోవైపు గుమ్మడాపురం రక్షిత తాగునీటి పథకం రూ.11.70కోట్లతో చేపట్టారు. ఈ పథకం నిధుల్లేక ఎక్కడి పనులు ఆక్కడే నిలిచిపోయాయి. రెండేళ్ల క్రితం గుత్తేదారు చేసిన పనుల వరకు బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత నిధులు మంజూరు కాలేదని పనులు ఆపేశారు. సకాలంలో ఈ ప్రాజెక్టు పూర్తికాక 10 వేల మందికిపైగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లనీటిపై ఆధారపడి ఫ్లోరైడ్‌ బారిన పడుతున్నారు. అధికారిక ఆమోదంతో నిధులు వస్తే నెల రోజుల్లోగా పనులు పూర్తి చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి

మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీల్లో కోనసీమ కుర్రాడు

ABOUT THE AUTHOR

...view details