కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని కుందూనది పరివాహక గ్రామాల్లో నీటమునిగిన పంట పొలాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. నంద్యాల, శ్రీశైలం ఎమ్మెల్యేలు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు.
కుందునది నుంచి 21వేల కూసెక్కుల నీటిని నెల్లూరు జిల్లా సోమశిలకు తరలించే క్రమంలో వెలుగోడు, బండిఆత్మకూరు, నంద్యాల, గోస్పాడు మండలాల్లో పలు గ్రామాల్లో వరి నాట్లు కొట్టుకుపోయాయి. రెండో సారి వరి నాటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగిన న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.