కరోనా వైరస్ నివారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో కరోనా పై సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో పాజిటివ్ కేసుల సంఖ్య, కోలుకున్న వారి వివరాలను తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది కొరత, ఇతర విషయాలను అధికారులతో చర్చించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టెస్టింగ్ ల సంఖ్య పెరగడంతో కరోనా కేసులు తెలుస్తున్నాయని అన్నారు. టెస్టింగ్ లు పూర్తయితే ..కేసులు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. వలస కూలీలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తామన్నారు. వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ,ఇతర అంశాల పై అధికారులతో చర్చించారు.