ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిర్చి ధరలు ఊరటనిస్తున్నా.. విత్తన ధరలు భయపెడుతున్నాయి - కర్నూలులో మిర్చి ధరలు

మార్కెట్‌లో మిర్చి ధరలు అన్నదాతలకు కాస్త ఊరటనిస్తున్నాయి. కానీ వాటిని సాగు చేయాలంటే మాత్రం విత్తన ధరలు గుండెలు గుబేలు మనిపిస్తున్నాయి. మార్కెట్‌లోకి విచ్చలవిడిగా వివిధ కంపెనీలు వస్తున్నా, అవి కొనుగోలు చేస్తే తెగుళ్ల బారిన పడతామెమోనన్న ఆందోళన నెలకొంటోంది. మంచి కంపెనీల విత్తనాలకు డిమాండ్‌ నెలకొనడంతో దళారులు వాటిని నల్లబజారులో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దుకాణదారులు కూడా మిర్చి విత్తనాలను ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారని కర్షకులు వాపోతున్నారు.

mirchi seeds
mirchi seeds

By

Published : Jul 1, 2020, 10:58 AM IST

కర్నూలు జిల్లాలో 24 వేల హెక్టార్లలో మిర్చిని సాగు చేస్తున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం, కోసిగి, కోడుమూరు తదితర ప్రాంతాల్లో అధికంగా సాగు జరుగుతోంది. గతేడాది మిర్చికి మంచి ధరలు పలకటంతో అన్నదాతలకు ఎంతో ఊరట లభించింది. దీంతో ఈ ఖరీఫ్‌లో మిర్చి సాగుపై రైతులు అధిక దృష్టి సారిస్తున్నారు. మిర్చి నారు కోసం విత్తనాలు కొనుగోలు చేయాలంటే మార్కెట్‌లో వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. 10 గ్రా. విత్తన ప్యాకెట్‌పై రూ.100 నుంచి రూ.150 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ఎకరాకు 100 గ్రాముల వరకు విత్తనాలు అవసరమవుతాయి. రైతులపై ఎకరాకు రూ.1000కి పైగానే అదనపు భారం పడుతోంది.

ధరల పట్టికలపై పట్టించుకోని అధికారులు

ఎరువులు, విత్తన దుకాణాలకు అనుమతులు పొందిన దుకాణాల వద్ద రైతులకు తెలిసేలా ధరల బోర్డును ఏర్పాటు చేయాలి. చాలా దుకాణాల వద్ద వీటిని అమలు చేయటంలేదు. సాగుదారులు దుకాణదారులు చెప్పిన ధరలకే కొనుగోలుచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దుకాణాల వద్ద ధరల సూచిక బోర్డులు ఏర్పాటు చేయకున్నా అధికారులు పట్టించుకోకపోవటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా రైతులు కొనుగోలు చేసిన వాటికి సంబంధించి బిల్లులు తప్పనిసరిగా వేయాల్సి ఉన్నా, అవి ఇవ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కమీషన్‌ ఎక్కువగా వస్తుందనే ఆశతో వివిధ రకాల కంపెనీల విత్తనాలను కర్షకులకు విక్రయిస్తుండటంతో సాగుదారులు సరైన దిగుబడులు రాక నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని వాపోతున్నారు. దీనికితోడు కొన్ని అనుమతులు లేనివాటిని విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఇబ్బంది

మిర్చికి మంచి ధరలు ఉన్నాయని, సాగు చేద్దామనుకుంటే విత్తనాల ధరలు అధికమయ్యాయి. 10 గ్రా. ప్యాకెట్‌ పైనే రూ.150 నుంచి రూ.200 వరకు అధికంగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. మేం అనుకున్న విత్తన రకాలు దొరకడం లేదు. విధిలేక ఇతర కంపెనీల విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నాం. అధికారులు రాయితీపై విత్తనాలు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. - వీరన్న, రైతు, గోనెగండ్ల

అనుకున్న రకాలు నల్లబజారుకు..

రైతులు సాగు చేయాలనుకున్న కంపెనీ రకం మార్కెట్‌లో దొరకటం లేదు. ఒకవేళ దొరికినా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. డిమాండ్‌ ఉందని అన్నదాతలపై ఇలా భారం మోపితే ఎలా? ఇతర కంపెనీల వాటిని కొనుగోలు చేయాలంటే తెగుళ్లతో దెబ్బతింటామేమో అనే ఆందోళన ఉంది. పేరున్న కంపెనీల విత్తనాలు అధిక ధరలకు విక్రయించేవారిపై చర్యలు తీసుకోవాలి.- శేషు, గోనెగండ్ల

అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం

విత్తన దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రైతులు ఫిర్యాదు చేస్తే అలాంటి వారిపై కఠిరన చర్యలు తీసుకుంటాం. కర్షకులు కొనుగోలు చేసిన వాటికి తప్పకుండా బిల్లులు తీసుకోవాలి. అధిక ధరలకు విక్రయించినట్లు తెలిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. ఎమ్మార్పీ ధరల కంటే తక్కువగానే అమ్మాలి. ధరల పట్టికలను దుకాణాల వద్ద తప్పకుండా ఏర్పాటు చేయాలి. లేకపోతే చర్యలు తప్పవు.- అశోక్‌వర్దన్‌రెడ్డి, ఏడీఏ

ఇదీ చదవండి:'పది కీలకరంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు జపాన్ సుముఖత'

ABOUT THE AUTHOR

...view details