ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి

కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోరుగా మద్యం వ్యాపారం, పేకాట శిబిరాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. పోలీసులపై గుమ్మనూరు అనుచరులు దాడి చేయటంతో ఓ ఎస్సైకి గాయాలయ్యాయి. ఈ దాడిపై స్పందించిన మంత్రి జయరాం.. పేకాట శిబిరాలతో తనకు సంబంధంలేదని పేర్కొన్నారు.

మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి
మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి

By

Published : Aug 28, 2020, 3:07 AM IST

Updated : Aug 28, 2020, 4:06 AM IST

మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామమైన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోని గుమ్మనూరులో కర్నాటక నుంచి అక్రమ మద్యం తరలించి వ్యాపారం చేస్తుండటం సహా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మూడు బృందాలు వేర్వేరుగా మఫ్టీలో ఆటోలో బయలుదేరి గుమ్మనూరు చేరుకున్నాయి. మొదట వెళ్లిన ఆటోను అడ్డగించి కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఆటో అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎస్సై సమీర్ బాషాకు గాయలయ్యాయి. పోలీసులు అని చెబుతున్నా వినకుండా దాడికి దిగారు.

మొత్తం 35 మంది నిందితులు

మరో రెండు బృందాలు గ్రామానికి చేరుకోవటంతో... దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు పారిపోయారు. వారిలో చిప్పగిరి మండల వైకాపా కన్వీనర్ నారాయణ, చిప్పగిరి మండలం దవలతాపురం ఎంపీటీసీ శ్రీధర్, ఆయన కుమారుడు అజయ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేకాట శిబిరం వద్దకు పోలీసులు చేరుకోగా... కొందరు పారిపోయారు. పేకాట కోసం ప్రత్యేకంగా ఓ టెంట్ వేశారు. అక్కడే మద్యం టెట్రా ప్యాకెట్లు, పేక ముక్కలు, 5 లక్షల 34 వేల నగదు, 35 కార్లు, 6 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. మొత్తం 35 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గౌతమీ సాలి తెలిపారు. పట్టుబడినవారు డ్రైవర్ల లేక పేకాట ఆడటానికి వచ్చినవారా అనే విషయాలు విచారణలో తేలుతుందని గౌతమీ సాలి తెలిపారు. మంత్రి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయనటంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

నాకు సంబంధం లేదు : మంత్రి జయరాం

ఈ ఘటనపై స్పందించిన మంత్రి జయరాం.. గుమ్మనూరులో పేకాట వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పేకాట శిబిరంపై దాడిచేసిన పోలీసులను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. దాడి వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని మంత్రి అన్నారు. పేకాట, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలన్నారు. గత ఆరేళ్లుగా ఆలూరులో నివసిస్తున్నానని తెలిపారు.

ఇదీ చదవండి :నేడు.. తితిదే ధర్మకర్తల మండలి కీలక సమావేశం

Last Updated : Aug 28, 2020, 4:06 AM IST

ABOUT THE AUTHOR

...view details