Minister Jayaram Land Registration Scam: మంత్రి గుమ్మనూరు జయరాం 'ఇట్టినా' భూముల కొనుగోలు వ్యవహారంలో.., రిజిస్ట్రేషన్లోనూ అడ్డదారులు తొక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని బినామీ లావాదేవీగా గుర్తించిన ఐటీ శాఖ.. మంత్రి భార్య రేణుకమ్మ పేరిట ఉన్న 30 ఎకరాలను ఇప్పటికే అటాచ్ చేసింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని ఆస్పరి, చిన్నహోతూరు గ్రామాల పరిధిలో 2006లో రియల్ ఎస్టేట్ సంస్థ ఇట్టినా కంపెనీ 443 ఎకరాలు స్థానికుల నుంచి కొనుగోలు చేసింది. అప్పట్లోనే వ్యవసాయేతర భూములుగా మార్పుచేసింది.
ఆస్పరి పరిధిలోని 17సర్వే నంబర్లలోని.. 81.41 ఎకరాలు, చిన్నహోతూరులోని 31 సర్వేనంబర్లలోని 209.14 ఎకరాలను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్‌గా మార్చాలని ఆర్జీ పెట్టుకుంది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం 1839, 2009, 184 నంబర్లతో చలానాలు తీసి 9శాతం పన్ను చెల్లించింది. 2008 ఆగస్టు 4న తహసీల్దార్ నివేదిక ఇవ్వగా, అదేనెల 23న ఆర్డీవో వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నాటి నుంచి 290.55 ఎకరాలపై జరిగే లావాదేవీలు ఎకరాల్లో కాకుండా, చదరపు గజాల్లో చేయాల్సి ఉంటుంది. కన్వర్షన్ అయ్యాక తిరిగి వ్యవసాయ భూములుగా మార్చరాదని నాలా చట్టం చెబుతోంది.
మంత్రి జయరాం తన భార్య పేరుతో 30.83 ఎకరాలు 2020 మార్చిలో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్టరైన సర్వే నంబర్లరో (674/E, 729, 688/2, 668/సి, 689/సి, 713/ ఏ) ఇట్టినా కంపెనీ కన్వర్షన్ చేయించిన జాబితాలోనే ఉన్నాయి. వీటిని మంత్రి వ్యవసాయ భూములుగా చూపించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్పరిలో వ్యవసాయేతర భూమి ఎకరా విలువ 20.33 లక్షల నుంచి 38.72 లక్షల వరకు ఉంది. మెట్టభూమి విలువ 3లక్షలుగా ఉంది. వ్యవసాయ భూములుగా చూపినందున 7.5శాతం స్టాంపు డ్యూటీ చొప్పున ఎకరాకు రూ.22,500 చొప్పున చెల్లించినట్లు అవుతుంది.