రాష్ట్రంలోనే వివాహ ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో కర్నూలు ప్రథమ స్థానంలో ఉంది. పత్రాల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తుల పరంగా జిల్లా రెండో స్థానంలో ఉంది. రాజకీయ అండదండ ఉన్నవారికి త్వరగా పత్రాలు మంజూరవుతుంటే, సామాన్యునికి మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. కొంత మంది ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ప్రాథమిక స్థాయిలో వెనుదిరిగిపోవాల్సిన పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయి. జిల్లాలోని 53 మండలాల పరిధిలో 10 మండలాల వరకు మూడంకెల సంఖ్యలో దరఖాస్తులకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులకు సరైన పరిజ్ఞానం లేక పత్రాల జారీని ఆలస్యం చేస్తున్నారు. దీంతో పాస్‌పోర్టు, ఇతర అత్యవసర పనుల కోసం సరైన సమయంలో వివాహ ధ్రువీకరణ పత్రాలు పొందలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా...
ఆదోని మండలం ఢణాపురం గ్రామంలో ఆరు దరఖాస్తులు రాగా మూడింటిని తిరస్కరించిన సిబ్బంది మరో మూడింటిని పెండింగ్‌లో ఉంచారు. బనగానపల్లి మండలం పాతపాడు గ్రామంలో 48 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బనగానపల్లి పట్టణంలో 110 దరఖాస్తులకు మోక్షం లభించలేదు. మండల కేంద్రమైన బేతంచర్లలో 27 పెండింగ్‌లో ఉండగా ఇదే మండలంలోని రంగాపురంలో 29 మంది పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. మండల కేంద్రమైన కోసిగిలో 46, కౌతాళం మండలం ఉరుకుందలో 27 మంది దరఖాస్తు చేసుకోగా పెద్దఎత్తున జనం పత్రాల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
భారీగా తిరస్కరణ
ఒకవైపు జిల్లా వ్యాప్తంగా వివాహ ధ్రువీకరణ పత్రాలు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉండగా, వందల సంఖ్యలో తిరస్కరణకు గురవుతుండటం గమనార్హం. బండి ఆత్మకూరు మండలంలో 285 దరఖాస్తులు రాగా ఇందులో 116 తిరస్కరణకు గురయ్యాయి. బనగానపల్లిలో 62, నంద్యాలలో 47, జూపాడుబంగ్లాలో 34, కొత్తపల్లిలో 32, పాములపాడు మండలంలో 28 దరఖాస్తులను ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించారు.