ప్రశ్న : కర్నూలు జిల్లా రైతులపై ఉల్లి ఎగుమతుల నిషేధ ప్రభావం ఎలా ఉంటుంది ?
జవాబు : ఉల్లిని విదేశాలకు ఎగుమతులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం జరిగింది. దేశీయ మార్కెట్లో రిటైల్‌లో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ఈ సారి ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడం జరిగింది. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉల్లి దిగుబడి తగ్గింది.
ప్రశ్న : గతేడాది ఈ సమయంలో కిలో వంద రూపాయలు ధర ఉంది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి ?
జవాబు : మహారాష్ట్రలో ఉల్లి కిలో 25 నుంచి 45 రూపాయల వరకు పలుకుతోంది. మన కర్నూలు ఉల్లి హోల్ సేల్ ధర క్వింటాలుకు 800 నుంచి 900 రూపాయలు ఉంది. రిటైల్‌గా కిలో 15 నుంచి 25 రూపాయలుగా ఉంది.
ప్రశ్న : ఈ ధరలు ఎంత వరకు పెరిగే అవకాశముంది.. ఎగుమతులు ఆపడం వల్ల ఈ ధరలు దిగివచ్చే అవకాశముందా ?
జవాబు : రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో భారీగా ధరలు పెరుగుతాయని ఒక అంచనా. కర్నూలు జిల్లాలో జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలతో ఉల్లి పంటకు కొంత నష్టం జరిగింది. దిగుబడులు తగ్గడంతో రాబోయే నెలల్లో ధర పెరుగుతుందనే ఉద్దేశంతో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడం జరిగింది.
ప్రశ్న :మన రైతులపై దీని ప్రభావం ఎంత ఉంటుంది ?
జవాబు : ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ధర అనేది రైతులకు ఆశాజనకంగానే ఉంది. యావరేజ్ క్వాలిటీకి హోల్ సేల్ ధర 800 నుంచి 1100 వరకు పలుకుతోంది. మంచి ఉల్లికి క్వింటాలుకు 2 వేల నుంచి 2300 ధర వస్తోంది. కరోనాతో ప్రజలకు డబ్బు ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోయింది. సాధారణ మానవుడిపై అధిక ధరల ప్రభావం పడరాదనేది ప్రభుత్వం ఉద్దేశం.
ప్రశ్న :మన జిల్లా నుంచి ఉల్లిని ఎక్కడికి పంపే అవకాశముంది ?
జవాబు : మన జిల్లా నుంచి చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా అక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు కూడా వెళతాయి. మన దేశం నుంచి బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, సింగపూర్ లాంటి దేశాలకు ఎగుమతులు అనేవి జరుగుతాయి.