ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇష్టానుసారంగా పోస్టుల భర్తీ_తీవ్రంగా నష్టపోయిన నిరుద్యోగులు - Manipulations in Kurnool Medical Health Department

కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్‌ మిషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీలో తమకు ఆన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు వాపోయారు. అధికారులకు విన్నపించినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవటంతో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు.

Manipulations in  Kurnool Medical Health Department
కర్నూల్​ వైద్య ఆరోగ్య శాఖలో అవకతవకలు

By

Published : Dec 16, 2020, 2:24 PM IST

Updated : Dec 16, 2020, 4:20 PM IST

కర్నూల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్‌ మిషన్‌ ఆధ్వర్యంలో రెండు నెలల కిందట ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా పదేళ్ల కిందట ఇంటర్‌, జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ కోర్సు) చేసిన వారికి జీవో 217 ప్రకారం అన్యాయం జరిగింది. జిల్లాలో 2001 జీవో ఆధారంగా పోస్టులు భర్తీ చేశారు. తమకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు అధికారులకు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోలేదు. మరోవైపు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ జీవోను ప్రాతిపదికన తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీనిని అవకాశంగా తీసుకుని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కొందరి ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరించారు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో అధికారులు 2017లో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు 301 ప్రకారం పోస్టులు భర్తీ చేయగా కర్నూల్ జిల్లా అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. 2001లో విడుదలైన 217 జీవోను ఆధారంగా చూపుతూ పోస్టులు భర్తీ చేయడంతో సమస్యలు ఎదురయ్యాయి.

ఎంతో వ్యత్యాసం:

వాస్తవంగా పదేళ్ల కిందట ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారికి, ప్రస్తుతం కోర్సు పూర్తిచేసేవారికి మార్కుల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అకడమిక్‌ మార్కులు 45 శాతం, నర్సింగ్‌ కోర్సుకు మరో 45 శాతం వెయిటేజీ ఇస్తుండటంతో పదేళ్ల కిందట ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు నష్టపోతున్నారు. నిబంధనల ప్రకారం కొత్త జీవో ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు. జిల్లాలో మాత్రం 19 ఏళ్ల కిందట విడుదలైన జీవోను ఆధారంగా తీసుకోవడం గమనార్హం.

202 పోస్టుల భర్తీ:

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రకటనలు విడుదలయ్యాయి. మరోవైపు పలానా జీవోతో భర్తీ చేయాలంటూ ప్రభుత్వం ఎక్కడా నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు వరంగా మారింది. 326 పోస్టులకు సంబంధించి అక్టోబరులో ప్రకటన వెలువడగా జిల్లా వ్యాప్తంగా 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 202 స్టాఫ్‌ నర్సుల పోస్టులను భర్తీ చేశారు. ఇందులో సింహభాగం ప్రస్తుతం వచ్చిన ఇంటర్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకోవడంతోపాటు జీఎన్‌ఎం పూర్తిచేసినవారే ఉన్నారు. ఫలితంగా జిల్లాలో పదేళ్ల కిందట ఇంటర్‌ చదివి జీఎన్‌ఎం కోర్సు చేసినవారికి రిక్తహస్తం మిగిలింది. అప్పట్లో ఇంటర్‌ మార్కులు అంతంతమాత్రంగానే వచ్చేవి. వారందరూ బాగా నష్టపోయారు.

"రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జీవో నంబరు 217ను అనుసరించి జిల్లాలో భర్తీకి చర్యలు చేపట్టాం. ఈ జీవోను అనుసరించే ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ నియామక ప్రక్రియ పూర్తిచేశారు. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలు మాత్రం 301 జీవోను ప్రామాణికంగా తీసుకొని ఉండొచ్చు . ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తేగానీ ఏమీ చేయలేం. ఎంపికైనవారి జాబితాను కలెక్టర్‌కు పంపాం".

- శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో కార్యాలయ పర్యవేక్షకుడు.

ఇదీ చదవండి : 'నీరు-చెట్టు పథకం బాకాయిలను వెంటనే చెల్లించాలి'

Last Updated : Dec 16, 2020, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details