అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులతో కూడిన వర్షం కర్నూలు జిల్లా మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓర్వకల్లు, డోన్, ప్యాపిలి, బేతంచర్ల, బనగానపల్లి, రుద్రవరం మండలాల్లో సుమారు 3 వేల 600 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఎక్కువ శాతం బంగినపల్లి రకాలనే పండిస్తున్నారు. ఈసారి కాపు బాగానే వచ్చింది. లాభాల పంట కూడా పండుతుందని రైతులు టన్నుల టన్నుల ఆశలు పెట్టుకున్నారు. కానీ గాలివాన వారి రెక్కల కష్టాన్నినేలపాలు చేసింది. ఈదురుగాలులకు కొమ్మలు విరిగి, మామిడి కాయలు నేలరాలాయి. చేతికందాల్సిన పంట వర్షార్పణమైంది.
కోసిన కాయలు కొనేందుకే కొర్రీలు వేసే వ్యాపారులు నేలరాలిన కాయలు కొనడానికి ఇంకెన్ని వంకలు పెడతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల పెట్టుబడి పెట్టామని, అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. అకాల వర్షాలు, గాలుల కారణంగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.