అతడో ఆర్థిక నేరగాడని పోలీసులకు తెలుసు.. అప్పటికే అతనిపై 21 కేసులున్నాయి.. ఠాణాకు మూడొందల మీటర్ల దూరంలోనే మరో ఆర్థిక నేరానికి తెరలేపాడు. బ్యాంకు పేరుతో మధ్యతరగతి ప్రజలను నిలువునా ముంచాడు. దీనిపై ఫిబ్రవరిలో కేసు నమోదైతే అతగాడి వ్యవహారాలపై ఎనిమిది నెలలుగా విచారణ చేయకుండా పక్కనపెట్టారు. బాధితులే నిందితుడిని పట్టిస్తే విధిలేక అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూర్‌లోని వర్ధన్ బహుళ రాష్ట్ర సహకార సంస్థ లిమిటెడ్ నిర్వాహకుడు మహేశ్ వ్యవహారంపై పోలీసులు అనుసరించిన తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు.
మూడు నెలల్లో రూ.కోట్ల సేకరణ
ఎమ్మిగనూరుకు చెందిన మహేశ్ ఆర్థిక నేరగాడిగా జిల్లా పోలీసులే గుర్తించారు. ‘మహి’ పేరిట సంస్థ నెలకొల్పి నిరుద్యోగులు, రైతులను రూ.14.41 కోట్ల మేర మోసం చేశాడు. ఓ కేసులో ఆదోని జైలుకు వెళ్లి నకిలీ పీటీ వారెంట్‌తో చాకచక్యంగా తప్పించుకొన్నాడు. జాషువాగా పేరుమార్చుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నాడని... మరణించాడని వదంతులు సృష్టించాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల ఫోన్లు, కంప్యూటర్లు హ్యాక్ చేసి విచారణ సమాచారం తొలగించాడు. గుంటూరుకు మకాం మార్చిన మహేశ్‌ను జిల్లా పోలీసులే గుర్తించి అరెస్టు చేశారు. బయటకొచ్చాక ఆత్మకూరులో వర్ధన్ బహుళ రాష్ట్ర సహకార సంస్థ లిమిటెడ్ పేరుతో ఓ సొసైటీ తెరిచి మూడు నెలల్లో వందల మంది నుంచి డిపాజిట్లు, రాయితీల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టాడు.
రెట్టింపు డబ్బులు వస్తాయని
పెట్టిన డబ్బులకు ఏడాదిలోగా రెట్టింపు ఇస్తానంటూ ప్రజలకు ఎర వేశాడు. తొలిరోజుల్లో కొందరికి రెట్టింపు డబ్బులు చెల్లించి నమ్మకం కుదిర్చాడు. ఆ తర్వాత పెద్ద మొత్తం డిపాజిట్ చేయించడం మొదలు పెట్టాడు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్కులను డిపాజిటర్లకు ఇచ్చి నమ్మబలికాడు. ఎన్‌డీడీవీ, ఎన్‌సీడీసీ కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి 50 శాతం రాయితీ సొమ్ము జమ అవుతుంది.., లబ్ధిదారులు మిగిలిన 50 శాతం చెల్లిస్తే గేదెలు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు అందిస్తామని నమ్మించాడు.
ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసినా
మహేశ్ అరాచకాలపై ఫిబ్రవరి 3న ఓ మహిళ ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ‘వర్ధన్’ బ్యాంకు ఆత్మకూరు బ్రాంచిలోనే పనిచేయడం గమనార్హం. ‘‘ రూ.1.50 లక్షలు తీసుకొని మేనేజర్ పోస్టు ఇచ్చారని.. డిపాజిట్లకు రెట్టింపు.. రాయితీ రుణాలు మంజూరు చేయిస్తానంటూ రూ.2.50 కోట్లు డిపాజిట్లు చేయించి సొమ్ముతో పరారీ అయినట్లు’’ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడితో ములాఖాత్ అయినట్లు అప్పట్లో విమర్శలొచ్చాయి. ఎనిమిది నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.
అధికార పార్టీ నాయకుల హడావుడి
ప్రారంభోత్సవానికి శ్రీశైలం ఎమ్మెల్యే హాజరుకావడం.. అధికార పార్టీ నాయకులు హడావుడి చేశారు. డిపాజిట్ల సేకరణలోనూ కొందరు సహకరించారు. తీరా బ్యాంకు బోర్డు తిప్పేయడంతో ‘‘ ఏదో ఒకటి చేసి డబ్బులు ఇప్పిస్తామంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. మహేశ్‌కు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయన్న భయంతో చాలా మంది ముందుకురావడం లేదు. నందికొట్కూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, కొత్తపల్లి, పగిడ్యాల పరిధిలోనే 150 మంది వరకు బాధితులున్నారు. ఈ ఒక్క నియోజకవర్గ పరిధిలో రూ.4కోట్ల వరకు బాధితులు నష్టపోయినట్లు సమాచారం. పత్తికొండ, ఎమ్మిగనూరుకు చెందిన బాధితులు ముందుకొచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట ఎమ్మిగనూరులో కొందరు బాధితులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహేశ్ అలియాస్ జాషువాపై 420, 120బి చీటింగ్, 34 యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం నిందితుడిని కర్నూలు కోర్టుకు తీసుకురాగా మంగళవారం ఉదయం హాజరుపర్చాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
ఆస్తులను స్వాధీనం చేసుకుని న్యాయం చేయండి..
'మాది ఆత్మకూరు పట్టణంలోని స్వరాజ్‌నగర్. వర్ధన్ బ్యాంకుపై నమ్మకంతో 18 మందితో దాదాపు రూ.కోటి వరకు చెల్లించాం. వాహనాలు, గేదెలు 50 శాతం రాయితీతో ఇప్పిస్తామని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు బ్యాంకు బోర్డు తిప్పేశారు. నన్ను నమ్మి డబ్బులు చెల్లించిన వారు నాపై ఒత్తిడి తెస్తున్నారు. బ్యాంకు నిర్వాహకులు, వారి బంధువుల పేరిట ఉన్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలి.'-రంగస్వామి, ఆత్మకూరు, బాధితుడు
నాకు సంబంధం లేదు
వర్ధన్ సొసైటీ అక్రమాలకు నాకు సంబంధం లేదు. వైకాపా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలన్న పిలిస్తే కార్యక్రమానికి వెళ్లి ప్రారంభించాను. బాలన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. డబ్బులు కట్టించిన వారే బాధ్యులు. బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీతో మాట్లాడాను.- శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే
కర్నూలు జిల్లాలో వర్ధన్ కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో ఆత్మకూరులో బ్యాంకును ఏర్పాటుచేసి ఎస్సీ, ఎస్టీలు, నిరుపేదలను దోచుకున్నారని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డితో కలిసి సోమవారం మాట్లాడారు. వర్ధన్ బ్యాంకును శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారని, వర్ధన్ బ్యాంకు అంటే శిల్పా బ్యాంకు అన్నట్లే అని బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులున్న బ్యాంకు ఛైర్మన్ మహేష్, వైకాపా నంద్యాల పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలన్న కుమార్తె మేనేజర్‌గా ఉన్నారన్నారు. ఆమె ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్నారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
ఆయన కనుసన్నల్లోనే నడిచింది
ఆత్మకూరులోని వర్ధన్ సొసైటీ కార్యకలాపాలు, డిపాజిట్ల సేకరణ, రాయితీ రుణాల పేరుతో మోసం చేయటం వంటి కార్యకలాపాలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని భాజపా నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ప్రభుత్వ అతిథి గృహంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఇదీ చదవండి: