ఆళ్లగడ్డలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి... - man dead in allagadda news
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దూదేకుల బాబయ్య (40) అనే వ్యక్తి.. అనుమానాస్పదంగా మృతి చెందాడు. విద్యుత్ అధికారులు మాత్రం అతడు మిద్దెపై నుంచి కింద పడి మృతి చెందాడని పేర్కొంటున్నారు. బంధువులు మాత్రం విద్యుదాఘాతంతో మృతిచెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే...
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని శ్రీనివాసనగర్‌లో బంగారం దుకాణం నడుపుకుంటూ జీవనం సాగించే బాబయ్య అనే వ్యక్తి మిద్దెపై నుంచి కిందికి దిగుతూ కాలుజారి విద్యుత్ తీగలపై పడ్డాడు. విద్యుత్ అధికారులు మాత్రం నేరుగా మిద్దెపై నుంచి కింద పడటం వల్లే మృతి చెందారని, విద్యుదాఘాతానికి గురికాలేదని వాదిస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డ పట్టణ ఎస్సై రామిరెడ్డి ఘటనాస్థలికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుని బంధువులు మాత్రం బాలయ్య విద్యుత్ తీగలు తగిలే విద్యుదాఘాతానికి గురై మరణించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని, శవ పరీక్షల్లో మృతికి కారణాలు తెలుస్తాయని ఎస్సై వెల్లడించారు.