Mahashivaratri: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. వేలాది మంది పాద యాత్రికులతో పాటు బస్సుల్లో, సొంత వాహనాల్లో భక్తులు కొండకు చేరుకున్నారు. 8 వేలకుపైగా వాహనాలు పార్కింగ్ స్థలాల్లో కిక్కిరిశాయి. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో ఆలయ మాడ వీధులు, పురవీధులు, ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. శివనామస్మరణతో శ్రీశైలం మార్మోగింది.
పాదయాత్రగా వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనానికి ఆరు గంటలకుపైగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటలకుపైగా సమయం పడుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ఉత్తర మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేక మండపం ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి 7 గంటలకు మల్లికార్జునస్వామికి లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గర్భాలయ విమాన గోపురానికి పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.