ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంపీ స్కిన్‌ వైరస్ తో మూగజీవాలకు నరకం.. పాల ఉత్పత్తిపై ప్రభావం.. మొద్దు నిద్రలో యంత్రాంగం - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Lumpy Skin Disease: రాష్ట్రంలో మూగజీవాలకు పెద్దకష్టం వచ్చి పడింది. లంపీ స్కిన్‌ అనే పిలిచే ముద్దచర్మ వ్యాధితో మూగజీవాలకు నరకయాతన అనుభవిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. పాల ఉత్పత్తిపైనా ప్రభావం చూపించి.. రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. వ్యాధి విస్తరిస్తున్నా.. యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అంటూ దాటవేస్తున్నారు.

Lumpy Skin Disease
Lumpy Skin Disease

By

Published : Jan 2, 2023, 8:22 AM IST

Updated : Jan 2, 2023, 10:49 AM IST

Lumpy Skin Disease: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం శోగనూరు గ్రామంలో ఇటీవల సుమారు 38 పశువులు చనిపోయాయి. లంపీ స్కిన్‌ అనే ముద్దచర్మ వ్యాధి కారణంగానే అవి మృతి చెందాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటి 50వేల చొప్పున దాదాపు 19 లక్షల విలువైన పశుసంతతికి నష్టం వాటిల్లింది. పాల ద్వారా రోజుకు వచ్చే 300 పైగా ఆదాయం పోయిందని రైతులు అంటున్నారు. రాష్ట్రంలో పశువులకు సోకిన ముద్దచర్మ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉందో శోగనూరు ఘటన తెలియజేస్తుంది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. వ్యాధి ప్రభావం అంతగా లేదని చెబుతోంది. కనీసం చికిత్సకు అవసరమైన మందులనూ అందుబాటులో ఉంచడం లేదు. రైతులు ప్రైవేటు ఆసుపత్రుల్లో అయిదు వేల వరకూ ఖర్చు చేసి వాటికి వైద్యం చేయిస్తున్నారు.

రాష్ట్రంలో పశువులకు ముద్దచర్మ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. శరీరం నిండా దద్దుర్లు పెరిగి పెద్దవై.. పుండ్లు ఏర్పడి.. ఆవులు, ఎద్దులు నరకయాతన అనుభవిస్తున్నాయి. పాలిచ్చే ఆవులు.. చనిపోవడంతో ఒక్కో రైతు 50వేల నుంచి 70వేల వరకు నష్టపోతున్నారు. పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. రైతుల ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు. 12 వందల 90 పశువులకు వ్యాధి సోకిందని, 271 మృతిచెందాయని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యాధి సోకిన పశువులకు గ్రామాల్లో చికిత్స కూడా అందడం లేదు. అవసరమైన మందులు బయట దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఆవులు, ఎద్దులు తదితర తెల్లజాతి పశువులకు ఇది వ్యాప్తి చెందుతోంది. గ్రామాల్లో దీని ప్రభావాన్ని రైతులు గుర్తించేలోగానే మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో వ్యాధి ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే తీవ్రత అన్ని జిల్లాల్లోను కన్పిస్తోంది. కొన్నిచోట్ల పశుసంవర్థక అధికారులు కూడా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతోందని అంగీకరిస్తున్నారు. మరో పక్క పశువులు సంతల కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి పెరుగుతోందని, వాటిని నిర్వహించొద్దని చెబుతున్నా... కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నేతలు దీనిని పట్టించుకోవడం లేదు.

ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో పశువులు ముద్దచర్మ వ్యాధి బారిన పడి చనిపోతున్నాయి. మొదట్లో ఒకటి రెండు దద్దుర్లతో మొదలై.. క్రమంగా అవి పెరిగి పెద్దగా శరీరమంతా విస్తరిస్తున్నాయి. పుండ్లుగా మారి.. వాటి ప్రాణాల మీదకు వస్తోందని రైతులు వివరిస్తున్నారు. లక్షణాలున్నా... పరీక్షలకు పంపినప్పుడు లంపీస్కిన్‌గా తేలడం లేదని అధికారులు చెబుతున్నారు. శరీరంపై దద్దుర్లు స్పష్టంగా కన్పిస్తున్నా.. చర్మవ్యాధి కాదనడం ఏమిటనే ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది.

లంపీస్కిన్‌ తీవ్రత రాష్ట్రంలో పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 48 నమూనాలు పంపిస్తే 19మాత్రమే పాజిటివ్‌ వచ్చాయి. క్షేత్రస్థాయిలో వ్యాధి సోకిన పశువులు వేలల్లో ఉంటున్నాయి. నగరాల్లో రహదారులపై తిరిగే ఆవులకు చికిత్స అందడం లేదు. విజయవాడలోనూ రోడ్లపై తిరిగే పశువులకు ఇలాంటి లక్షణాలే తీవ్రంగా ఉన్నాయి. అయినా అధికారులు మాత్రం సున్నాగా చూపిస్తున్నారు.

లంపీ సోకిన తర్వాత చికిత్స అందించేందుకు 3 వేల 500 నుంచి 5వేల వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. ఇంజక్షన్లతో పాటు ఆయింట్‌మెంట్, సెలైన్‌ బాటిల్స్, ఇతర మందుల్ని ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. తమ దగ్గర మందుల్లేవని, లక్షణాలు తక్కువగానే ఉన్నాయని, ఇబ్బందేమీ లేదని అధికారులు చెబుతున్నారని రైతులు అంటున్నారు. వారు తేలిగ్గా తీసుకోవడంతో.. ఆవులు, ఎద్దుల బాధ చూడలేక ప్రైవేటు వైద్యుల్ని ఆశ్రయిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

గోట్‌ పాక్స్‌ టీకా వేయించడం ద్వారా లంపీ స్కిన్‌ వ్యాధిని నివారించవచ్చని వైద్యాధికారులు అంటున్నారు. కొందరు రైతులు పాల దిగుబడి తగ్గుతుందనే ఆలోచనతో వేయించడం లేదని, ఫలితంగా అవి చనిపోతున్నాయని చెబుతున్నారు. లంపీ స్కిన్‌ కారణంగా.. పాల నాణ్యతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వినియోగదారులు మూడు పొంగుల వరకు కాచుకుని తాగాలని సూచిస్తున్నారు.

మూగజీవాలకు నరకం చూపిస్తున్న.. లంపీ స్కిన్‌ వైరస్​

ఇవీ చదవండి:

Last Updated : Jan 2, 2023, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details