Farmers Problems with water shortage: కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర దిగువ కాలువ ఎల్ఎల్సీ పరిధిలో.. ఈ ఖరీఫ్‌లో 38 వేల ఎకరాల్లో పత్తి, మిరప, వరి వంటి పంటలను సాగు చేశారు. మరో 15 వేల ఎకరాల్లో.. ఆయకట్టేతర కింద పంటలు వేశారు. వరి పొట్ట దశలో మిరప, పత్తి.. పూత, కాయ దశలో ఉన్నాయి. ఆశాజనకంగా పంట దిగుబడులు రావాలంటే సాగు తడులు క్రమం తప్పక అందించాలి. తుంగభద్ర నదిలో పుష్కలంగా నీరు ఉన్నా... దిగువ కాల్వకు ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో రెండు వారాల క్రితం నీటి సరఫరాను అధికారులు నిలిపేశారు. ఫలితంగా చుక్క నీరు పంటలకు అందడం లేదు. సుమారు 50 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది.
కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నుంచి కర్నూలు జిల్లా వరకు దిగువ కాల్వను నిర్మించారు. బళ్లారి సమీపంలో 121వ కిలోమీటర్ వద్ద హగరి నదిపై ఎల్ఎల్సీ కోసం 700 మీటర్ల పొడవున, 56 పిల్లర్లతో తుంగభద్ర దిగువ కాల్వ-ఎల్ఎల్సీ అక్విడక్ట్ పూర్తిచేశారు. ఈ నెల 12న వర్షాల కారణంగా.. హగరి నదికి భారీ వరద వచ్చింది. ఆ ఉద్ధృతికి అక్విడక్ట్ 15వ పిల్లర్ కొట్టుకుపోయిది. ఎల్ఎల్సీలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, పిల్లర్ కొట్టుకుపోవడంతో.. అక్విడక్ట్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు.. నీటి సరఫరాను నిలిపేశారు. రెండు వారాలైనా.. ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. దీని వల్ల వేలాది ఎకరాల్లోని పంటలకు నీరు అందడం లేదు. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు.
ఎల్ఎల్సీ పిల్లర్ కొట్టుకుపోయిన అక్విడక్ట్‌ను చెన్నై ఐఐటీ నిపుణుల బృందం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిపుణులు పరిశీలించారు. నదిలో వరద ప్రవాహం ఉన్న సమయంలోనూ.. పిల్లర్ల నిర్మాణం, మరమ్మతులు చేయడానికి ఉన్న అవకాశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పనులను బళ్లారికి చెందిన ఓ గుత్తేదారుకు అప్పగించారు. ఆయన వద్ద ఆధునిక సాంకేతికత లేకపోవడంతో.. పిల్లర్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఫలితంగా రైతుల్లో మరింత ఆందోళ పెరిగింది.
పిల్లరు కొట్టుకుపోయిన సమయంలోనూ.. జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురవడం వల్ల.. సాగునీటి సమస్య తలెత్తలేదు. వారం రోజులుగా వానలు లేకపోవడం, కాలువలో నీటి సరఫరా నిలిపివేయడంతో.... నీటి తడులు అందక.. పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరో ఐదారు రోజుల్లో నీరు ఇవ్వకపోతే.. పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. పంటలకు త్వరగా నీరైనా ఇవ్వాలి లేదా ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు పరిహారమైనా చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.