Nara Lokesh Yuvagalam Padayatra : రాయలసీమ ప్రజల సాగు, తాగు నీరు సమస్య పరిష్కారానికి తెలుగుదేశం చిత్తశుద్ధితో పని చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో 73వ రోజు యువగళం పాదయాత్రను ఎంకే కొట్టాల నుంచి ప్రారంభించిన లోకేశ్.. గుడిమిరాళ్ల రైతులు, బుర్రుకుంటలోని స్థానికులతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తామని లోకేశ్ రైతులకు హామీ ఇచ్చారు. జగన్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని అవేదన వ్యక్తం చేశారు. రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, దేవనకొండ మండలం వెంకటాపురంలో రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వం ఆపేసిన వేదావతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం హయంలో నగరడోన ప్రాజెక్ట్ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ రెండు ప్రాజెక్టులను తాము అధికారంలోకి వస్తే.. మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. టమాటా ధర రోజుకు ఒక విధంగా మారుతోందని.. కోల్డ్ స్టోరేజ్ లేకపోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాల్యు చైన్ పథకాన్ని 110 కోట్ల రూపాయలతో గతంలో రూపొందించామని.. దానిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిదన్నారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని వివరించారు.
పశువులకు ఉచిత వైద్యం : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జీవాలకు ఉచిత వైద్యం, మందులు అందిస్తామని వివరించారు. సబ్సిడీపై మేత పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు పశువుల షెడ్లను సబ్సిడీపై నిర్మిస్తామని వివరించారు. ప్రతి జీవానికి ఇన్సూరెన్స్ చేయించి.. పశువుల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ధైర్యాన్ని ఇచ్చారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గొర్రెలు, మేకల పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. లోకేశ్ పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో గొర్రెల కాపరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.