LOKESH FIRES ON CM JAGAN : జగన్ అండ్ కో డ్రామా కంపెనీ ఆడిన నాటకాలు ముగింపు దశకు వచ్చాయని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్రలో భాగంగా ఆస్పరి మండలం వలిగొండ క్రాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ పాల్గొన్నారు. చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు ఎన్ని కొత్త ఎత్తులు వేసిన లాభం లేదన్నారు. తండ్రిబాటలోనే తనయుడు జైలుకు వెళ్లడం ఖాయమని లోకేశ్ జోస్యం చెప్పారు. సీబీఐ దెబ్బకు సీఎం జగన్ పర్యటనలు సైతం రద్దు చేసుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నారని విమర్శించారు.
వివేకాను ఒప్పిస్తే అవినాష్ ఎంపీ అవుతాడు కానీ.. చంపేస్తే నేరస్తులు అవుతారని.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్ అంటూ లోకేశ్ నిలదీశారు. జగన్ డ్రామా ట్రూప్కి వచ్చే ఐడియాలు డెకాయిట్లకు కూడా రావన్నారు. ముందు బాబాయ్‌ని చంపేసారని.. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ డ్రామా ట్రూప్ ఎంత డేంజరో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణే చాలని.. అందుకే ఇది "జగనాసుర రక్త చరిత్ర" అంటూ విమర్శించారు. నా వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్.. ఇప్పుడు సీబీఐ కొట్టిన దెబ్బకి పర్యటనలు రద్దు చేసుకొని వెంట్రుకలు పీక్కుంటున్నాడన్నారు. రాయలసీమ బిడ్డ కాదని.. ఆయన రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ విమర్శలు గుప్పించారు.
అప్పర్ తుంగభద్రతో రాయలసీమ ఎడారిగా మారుతుందని తెలిసినా కూడా స్వప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించే స్థితిలో కూడా జగన్ లేరన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతి అక్రమాలపైనా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాంను రెండు సార్లు గెలిపించారని.. అయినా అభివృద్ధికి ఆలూరు ఆమడ దూరంలో ఉందన్నారు. గుమ్మనూరు జయరాం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా.. వారి సామాజికవర్గానికి చేసింది ఏమీలేదన్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంలో ఆయన బెంజ్ కారు గిఫ్ట్‌గా తీసుకున్నారని.. అందుకే ఆయనని అందరూ బెంజ్ మంత్రి అంటున్నారన్నారు. బెంజ్ కారులో ఆలూరు రోడ్ల మీద తిరిగే దమ్ముందా అంటూ సవాలు విసిరారు. మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో అంతర్రాష్ట్ర పేకాట క్లబ్ నిర్వాహిస్తున్నారని, తన సోదరులు భూ కబ్జాలు, సెటిల్మెంట్స్ చేస్తున్నారని.. కర్ణాటక మద్యం రోజుకి ఒక లోడ్ ఆలూరులో దిగుతుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా సురక్షిత తాగు నీరు అందిస్తామని.. కొత్త రోడ్లు వేస్తామని.. టమాటో, ఉల్లి, పత్తి, మిరప, బెంగాల్ గ్రామ్ రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఆపేసిన పత్తికొండ రిజర్వాయర్, నగరడోన రిజర్వాయర్లను పూర్తి చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రులకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని.. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: