ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ దుకాణాల నుంచే భారీగా సరఫరా - కర్నూలులో మద్యం సరఫరా

వర్షాకాలంలోనూ జిల్లాలో నీటి ఎద్దడి ఎదుర్కొనే పల్లెలు ఉన్నాయి కానీ, మద్యానికి మాత్రం ఎలాంటి కొరత లేదు. కారణం పల్లెల్లో గొలుసు దుకాణాలు పెరిగిపోయాయి. ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలతో నిరుపేద కుటుంబాలు గుల్లవుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో చోద్యం చూస్తుండటంతో కర్నూలు జిల్లాలో వ్యాపారం జోరుగా సాగుతోంది.

supplying liquor bottles
గోనెసంచిలో వేసుకుంటున్న మద్యం సీసాలు

By

Published : Oct 9, 2020, 12:40 PM IST

జిల్లాలో ప్రస్తుతం 164 ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు సీసాల కంటే ఎక్కువ ఏ ఒక్కరికి సరఫరా చేయకూడదు. అలాంటి నిబంధనలకు జిల్లాలో పాతరేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే బల్కుగా గొలుసు దుకాణాలకు తరలిపోతోంది. ఆళ్లగడ్డలోని ఓ దుకాణంలో బస్తాల్లో చీప్ ‌లిక్కర్‌ తరలిస్తున్న వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఇదే పరిస్థితి జిల్లా అంతటా ఉంది. తక్కువ ధర పలికే సరకును ఇలా గొలుసు దుకాణాలకు తరలించి... మద్యం అంగడిలో స్టాక్‌ లేదని చెబుతున్నారు. ప్రభుత్వ వైన్స్‌లో అందుబాటులో ఉండాల్సిన మద్యం పల్లెల్లో గొలుసు దుకాణాల్లో దర్శనమిస్తోంది. క్వార్టర్‌ సీసాపై నిర్ణీత ధర కంటే రూ.20-30 అదనంగా వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు.

*జిల్లాలో మద్యం దుకాణాలు: 164

*రోజూ వ్యాపారం: రూ.కోటి పైగా

*సెబ్‌ ఆధ్వర్యంలో కేసులు: 5,879 (మే నుంచి ఆగస్టు 27 వరకు)

*అరెస్టు: 8,998

*స్వాధీనం: 40,492 లీటర్ల లిక్కరు

*వాహనాల స్వాధీనం: 2,348

కొత్త కొత్త పంథాలతో...

జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ప్రతి పల్లెలోనూ గొలుసు దుకాణాలు దర్శనమిస్తున్నాయి. ఈ దుకాణాల్లో ఎక్కువగా కర్ణాటక, తెలంగాణ మద్యం తెచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు పరిధిలో ప్రతి పల్లెలో గొలుసు దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అక్రమ మద్యం సరఫరా, అమ్మకాల్లో కొత్త పంథాలతో అడుగులు వేస్తున్నారు. ఆళ్లగడ్డలోని పాత బస్టాండ్‌ వద్ద ఎవరికీ అనుమానం రాకుండా మహిళలే ఉదయం పూట కూర్చొని అనధికారకంగా మద్యం అమ్మకాలు చేపట్టడం గమనార్హం.

ఆదోని పరిధిలో కర్ణాటకకు చెందిన కొందరు తుంగభద్ర నదీ తీరం వెంబడి ఉన్న కర్ణాటక గ్రామాల్లోని మద్యం దుకాణాల నుంచి సరకు రాత్రిళ్లు పుట్టిల్లో నది దాటించి చెప్పిన చోటకు తెచ్చి ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నాయి. మరికొందరు అనుమానం రాకుండా ప్రయాణికుల్లా హైదరాబాద్‌ నుంచి ఆదోనికి రైలు మార్గం ద్వారా, కర్నూలుకు పక్కనే ఉన్న అలంపూర్‌ నుంచి బస్సుల్లో మద్యం తెచ్చి గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇక గొలుసు దుకాణాల నిర్వాహకులు సైతం చరవాణిలో సంప్రదిస్తే ద్విచక్ర వాహనాలపై, ఐస్‌క్రీం తోపుడు బండ్లల్లో పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా చేరవేస్తున్నారు. ఇలా పక్క గ్రామాల వారికి మద్యం ఇచ్చినందుకు బాటిల్‌పై రవాణా ఛార్జి చేస్తున్నారు. ఇలా గొలుసు దుకాణాల్లో అనధికారికంగా ఏటా రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది.

ఆ ముందు... ఆ తర్వాత

ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 9 గంటలకు మూస్తున్నారు. ఈ దుకాణాలు తెరవక ముందు, మూసిన తర్వాత బెల్టుతో కథంతా నడిపిస్తున్నారు. మద్యం దుకాణాల పక్కనే ఉన్న శీతల పానీయ దుకాణాల్లో అనధికారిక విక్రయాలు జోరందుకుంటున్నాయి. దుకాణాల్లో సిబ్బంది సైతం ఇళ్లలో నిల్వలు పెట్టి అమ్ముతున్నారు. గడివేములలో ఓ అంగడిలో పనిచేసే వ్యక్తి భారీగా మద్యం సీసాలు తరలిస్తుండగా, మూడు నెలల క్రితం కేసు నమోదు చేశారు.

మూడు సీసాల కంటే ఎక్కువ ఇవ్వకూడదు

ఏ పరిమాణంలో ఉన్న సీసా అయినా మూడు కంటే ఎక్కువ ఒకరికే మద్యం దుకాణాల్లో ఇవ్వకూడదు. ఆళ్లగడ్డ ఓ వైన్‌ షాపులో బల్కుగా మద్యం తరలింపుపై నా దృష్టికి వచ్చింది. విచారణ చేయిస్తున్నాం. అబ్కారీ శాఖ స్టేషన్లు అన్నీ ఎస్‌ఈబీ(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పరిధిలో ఉన్నాయి. మద్యం తరలింపు, గొలుసు దుకాణాల నిర్వహణపై సెబ్‌ దాడులు చేస్తోంది. - నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌, అబ్కారీ శాఖ​​​​​​

ఇదీ చదవండి:'విద్యా కానుకను పార్టీ కానుకగా చేయకండి'

ABOUT THE AUTHOR

...view details