కర్నూలు జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపు మేరకు చేపట్టిన భారత్ బంద్‌లో భాగంగా.. ఉదయం ఆరు గంటలకే వామపక్ష పార్టీల నేతలు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ఈకార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ. గఫూర్ పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. వామపక్షాల నాయకులు రహదారిపై ఆందోళన చేపట్టారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ ఆదోనిలో వామపక్షాలు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. వామపక్షాల నాయకులు కొత్త బస్ స్టాండ్ నుంచి శ్రీనివాస్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఆందోళనలు చేస్తామని కార్మిక, రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంత్రాలయంలో వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. రాఘవేంద్ర కూడలిలో వామపక్షాలు రైతులకు ఉరిగా మారిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. బనగానపల్లెలో బంద్ విజయవంతమయ్యింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేశారు. రైతు సంఘాలు, వామపక్షాల నాయకులు పెట్రోల్ బంక్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం వద్ద జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు