Upper Bhadra project: తుంగ, భద్ర నదుల కలయికే తుంగభద్ర నది. కృష్ణా నదికి ఇది ఉప నది. తుంగభద్ర ప్రాజెక్టు ఎగువన భద్ర నదిపై అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తోంది. తుంగ నుంచి 17.4 టీఎంసీల నీటిని భద్రలోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి రెండో దశలో భద్ర నుంచి అజ్జంపుర సమీపంలోని టన్నెల్ ద్వారా 29.9 టీఎంసీల జలాలను మళ్లిస్తారు. మధ్య కర్ణాటకలోని చిక్కమగుళూరు, చిత్రదుర్గ, తుమకూరు, దావణగెరె జిల్లాల్లో.. సాగు, తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగిస్తామని.. కర్ణాటక చెబుతోంది. 2008లోనే ఈ ప్రాజెక్టు పనులను ప్రాథమికంగా ప్రారంభించారు.
ఇప్పటి వరకూ సుమారు 4 వేల 800 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు.. కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్ ప్రతిపాదనల్లో 5 వేల 300 కోట్లు కేటాయించడమే కాకుండా.. జాతీయ హోదా ప్రకటించి తామే నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం పట్ల.. కర్ణాటకలో హర్షం వ్యక్తమవుతోంది. రాయలసీమ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తుంగభద్ర నది నుంచి రాయలసీమలోని .. హేచ్ఎల్సీ,ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, బైరవానితిప్ప కాల్వల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నారు. ఎగువ కాల్వ-హేచ్ఎల్సీకి 32.5 టీఎంసీలు, దిగువ కాల్వ-ఎల్ఎల్సీకి 29 టీఎంసీలు, సుంకేసుల జలాశయం నుంచి ప్రారంభమయ్యే కెసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలు, బైరవానితిప్పకు 4.9 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కర్ణాటక అవలంబిస్తున్న వైఖరి కారణంగా.. ప్రస్తుతం ఈ నికరజలాల్లో సగం కూడా రావడం లేదన్నది రాయలసీమ నేతల వాదన.
ఒకవేళ తుంగభద్ర ప్రాజెక్టు ఎగువన అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే.. సీమకు రావాల్సిన వాటా రాదని... దీని వల్ల రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ.. ఉద్యమం చేపడుతున్నట్లు.. రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సీఎం సైతం ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ నెల 12న రాయలసీమలోని అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోంటే.. వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాయలసీమలో అగ్గి రాజేస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్.. ఉద్యమం చేపట్టాలని నిర్ణయం ఇవీ చదవండి: