ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAINS: ముంచెత్తిన వర్షాలు... కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధిక ప్రభావం - కర్నూలు జిల్లాలో వర్షాలు

రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో వానల ప్రభావం ఎక్కువగా కనిపించింది. మరికొన్ని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పుణ్యక్షేత్రం వరద నీటిలో చిక్కింది. మంత్రాలయానికి ఆనుకుని ఉన్న నల్లవాగు పొంగి పొర్లింది. పలు కార్యాలయాలు, నివాస ప్రాంతాలు నీటమునిగాయి.

ముంచెత్తిన వర్షాలు... కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధిక ప్రభావం
ముంచెత్తిన వర్షాలు... కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధిక ప్రభావం

By

Published : Jun 27, 2021, 7:57 PM IST

Updated : Jun 28, 2021, 6:31 AM IST

ముంచెత్తిన వర్షాలు... కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధిక ప్రభావం

రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేశాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా కుండపోత వర్షాలకు అల్లకల్లోలమైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా నందవరంలో 191.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంత్రాలయం, బండి ఆత్మకూరు, ఎమ్మిగనూరుల్లోనూ.. 100 మిల్లీమీటర్ల పైనే నమోదైంది. అన్ని మండలాల్లోనూ వర్షాల ప్రభావం ఉంది. జిల్లాలోని మొత్తం 54 మండలాల్లో ఒక్క రోజే 19 వందల 15 మిల్లీమీటర్ల వర్షం పడింది. మంత్రాలయం పుణ్యక్షేత్రం వరదలో చిక్కి విలవిల్లాడింది. 2009లో తుంగభద్ర నదికి వచ్చిన వరద ప్రళయాన్ని చవిచూసిన ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు.

శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం దాకా పెద్ద ఎత్తున వర్షం పడటంతో పంట పొలాల నుంచి వర్షం నీరు వంకల్లోకి చేరింది. మంత్రాలయానికి ఆనుకుని ఉన్న నల్లవాగు పొంగి పొర్లింది. వాగులో అడ్డంకులు ఉండటంతో వెనుక జలాల కారణంగా నీరంతా మంత్రాలయంలోకి ప్రవేశించింది. ఫలితంగా విద్యుత్ ఉపకేంద్రం, ఎంపీడీఓ కార్యాలయం, ఎంపీడీఓ కాలనీ, ఉన్నత పాఠశాల, తహసీల్దార్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్‌, ఆర్ అండ్‌ బీ అతిథిగృహం, కర్ణాటక అతిథిగృహం సహా పలు ప్రదేశాల్లోకి నీరు చేరింది. కనీసం 4 నుంచి 5 అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగింది. రామచంద్రనగర్‌, దళితవీధి, సుజయూంద్రనగర్‌, ఎంపీడీఓ కాలనీల్లోని 500 ఇళ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ప్రహరీని తొలగించడంతో నీరంతా రామచంద్రనగర్‌ శివారు కాలనీల్లోని 300 ఇళ్లలోకి చేరింది. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కల్లూరు మండలం రేమడూరులో హంద్రీ నది మధ్యలో ఓ గొర్రెల కాపరి చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆయనతో పాటు 70 గొర్రెలను ఒడ్దుకు చేర్చారు.

గుంటూరు జిల్లా రేపల్లె గుంటూరు, తూర్పుగోదావరి జిల్లా కూనవరం, కృష్ణా జిల్లా అవనిగడ్డ, ప్రకాశం జిల్లా పర్చూరు, చీరాలలో 60 నుంచి 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలు మండలాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 54.75, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 532.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. వర్షాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఇదీ చదవండీ..Corona: కరోనా నుంచి కొలుకున్న తగ్గని ఇతర సమస్యలు

Last Updated : Jun 28, 2021, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details