మొన్నటి వరకు తల్లి కొంగుచాటున పెరుగుతూ ఆడుతూ పాడుతూ హాయిగా జీవించేవారు ఈ ముగ్గురు అక్కా చెల్లెల్లు. ఓ సంఘటన కష్టమంటే ఏంటో తెలియని ఆ పసివారి జీవితాన్ని చీకటిమయం చేసింది. తల్లిని కోల్పోయి... తండ్రికి దూరమై అనాథలయ్యారు.
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్లకు చెందిన మల్లీశ్వరిబాయి... వెల్దుర్తి మండలం బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు. కల్లూరు మండలం బొల్లవరానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు సుధాకర్ ఈమెను ప్రేమించి రెండో భార్యగా చేసుకున్నాడు. వీరికి జోత్స్న, జీవనసుధ, చైత్ర ముగ్గురు సంతానం. మద్యానికి బానిసైన సుధాకర్ ప్రవర్తన గతి తప్పింది. భార్య, బిడ్డలను వేధించాడు. తట్టుకోలేని మల్లీశ్వరిబాయి పోలీసులను ఆశ్రయించింది. పోలీసు కౌన్సిలింగ్‌తోనూ సుధాకర్లో మార్పు రాలేదు. విసుగు చెందిన మల్లీశ్వరిబాయి... ఆత్మహత్య చేసుకుంది.
భార్య బలవన్మరణానికి కారణమయ్యాడని సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమగా చూసుకునే తల్లి దూరమైంది. బాధ్యతగా చూసుకుంటాడనుకున్న తండ్రి జైలుకెళ్లాడు. ఫలితంగా చిన్నారులు దిక్కులేనివారయ్యారు. వీరి పరిస్థితి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ చిన్నారులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. వారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.