KVR College Land Allotment Issues: కర్నూలు నగరంలోని ప్రతిష్ఠాత్మక కేవీఆర్ మహిళా కళాశాలలో రెండు కాలేజీల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. 1958లో రాజ్‌భవన్‌గా ఉన్న భవనంలో కేవిఆర్ మహిళా కళాశాలలను ఏర్పాటు చేశారు. దాదాపు 14 ఎకరాల ప్రాంగణంలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు కొనసాగుతూ వచ్చాయి. 1996లో డిగ్రీ, జూనియర్ కళాశాలలను విభజించి వేర్వేరుగా ప్రిన్సిపాళ్లను నియమించారు. ఉదయం జూనియర్ కళాశాల, మధ్యాహ్నం డిగ్రీ కళాశాలను నడుపుతున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉండటంతో కర్నూలు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి విద్యార్థినిలు అధిక సంఖ్యలో ఈ కళాశాలల్లో చేరేవారు. 2012 నుంచి ఇంటర్ విద్యార్థులకు హాస్టల్ తొలగించటం, గదులు సైతం తక్కువగా కేటాయించటంతో.. విద్యార్థినులు ఆందోళనబాట పడ్డారు. తమకు తరగతి గదులు, హాస్టల్ వసతి కల్పించాలని 2015 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు.
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్రపతికి, మానవ హక్కుల కమిషన్ కు పోస్టుకార్డులు రాశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. విద్యార్థులకు వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది ప్రభుత్వం హాస్టల్ కోసం ఒక ఎకరా, తరగతి గదుల కోసం మరో ఎకరా కేటాయించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అది ఇప్పటి వరకు జరగలేదు. దీంతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది.