ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Women cricketer: నాన్న కోసమే బ్యాట్ పట్టుకున్నా.. ఆయన కలను నెరవేర్చా..! - ap latest news

Women cricketer: నాన్నకి క్రికెట్‌ అంటే పిచ్చి. భారత్‌ ఓడితే తట్టుకోలేడు.. ఆయన ఇష్టాన్ని చూసి కూతురు దాన్నే కెరియర్‌గా ఎంచుకుంది. సినిమా కథ గుర్తొస్తోందా? కర్నూలు అమ్మాయి నీరుగట్టి అనూష జీవితమిది. టీకొట్టు నిర్వహించే నాన్న కలను దేశవాళీ జట్టుకు ఆడేదాకా ఎలా తీసుకెళ్లిందో.. తన మాటల్లోనే..!

kurnool women cricketer anusha story
నాన్న కోసం.. బ్యాట్ పట్టుకున్నా!​

By

Published : Mar 5, 2022, 7:17 AM IST

Women cricketer: హోటల్‌లో పనిచేస్తూ మధ్యమధ్యలో ఎదురుగా ఉన్న టీవీ షోరూం తలుపు పక్క నిలబడి క్రికెట్‌ చూసేవారట నాన్న. అదంటే అంత పిచ్చి ఆయనకు. కపిల్‌, సచిన్‌ల ఆటంటే ఇంకా! మేం ఇద్దరమ్మాయిలం, ఒక అబ్బాయి. అమ్మాయిల్లో ఒకరిని క్రికెటర్‌గా చూడాలని నాన్న కోరిక. కానీ.. బంధువులు, స్నేహితులు ‘ఆడపిల్లలకు క్రికెట్‌ ఎందుకు? పదో తరగతి వరకు చదివించి పెళ్లి చెయ్యి’ అనేవారు. నాన్న అవేమీ పట్టించుకోలేదు. నేను అండర్‌-19 కెప్టెన్‌గా రాణించి, పత్రికల్లో నా పేరు వచ్చినప్పుడు నాన్న నమ్మకంపై అందరికీ గురి ఏర్పడింది.

మాది కర్నూలు జిల్లా కోడుమూరు. అమ్మ లక్ష్మి, నాన్న వెంకటేశ్‌. నాన్న స్నేహితుడు డాక్టర్‌ రఘురాంరెడ్డి క్రికెట్‌ కోచింగ్‌ ఇస్తుంటారు. ఆయన మాకు శిక్షణనివ్వడానికి ముందుకొచ్చారు. అక్కకి చదువంటే ఆసక్తి. తను వెళ్లనంది. నాకేమో చిన్నప్పట్నుంచీ ఆటలంటే ఇష్టం.. దీంతో నేను వెళతానన్నా. కిట్‌, షూ సహా అన్నీ శిక్షకులే సమకూర్చారు. ‘క్రికెట్‌ చాలా కష్టమైన ఆట. ఆడపిల్లలు అసలే ఆడలేరు. సమయం వృథా చేసుకోకు’ అన్నారు చాలామంది. వాళ్ల మాటలు నాలో పట్టుదలను నింపాయి. రోజూ 5-6 గంటలు సాధన చేసేదాన్ని. ఆ శ్రమ ఫలితమే 2009లో రాష్ట్ర జట్టులో స్థానం.

క్రీడల్లోకి రావాలనుకునే అమ్మాయిలు కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. కష్టానికి భయపడొద్దు. ముందు మనల్ని మనం నమ్మాలి. అప్పుడు క్రికెట్టే కాదు దేనిలోనైనా రాణిస్తాం.

క్రికెట్​లో రాణిస్తున్న నీరుగట్టి అనూష

రంజీ జట్టుకు కెప్టెన్‌..

ఒక అండర్‌-19 మ్యాచ్‌లో తమిళనాడుపై 169 పరుగులు చేసి ఆంధ్రా జట్టు గెలుపులో కీలక భాగస్వామినయ్యా. అండర్‌-23లో హైదరాబాద్‌, గోవా జట్లపై సెంచరీలు సాధించా. అండర్‌-19, 23 జట్లకు కెప్టెన్‌గానూ వ్యవహరించా. అండర్‌-23 ట్వంటీ20 ఛాలెంజర్స్‌ ట్రోఫీ నా సారథ్యంలోనే గెలుచుకున్నాం. రంజీ మ్యాచ్‌ల్లో హరియాణాపై 75 పరుగులు సాధించి జట్టు గెలుపునకు కృషి చేశా. అర్ధశతకాలు పదికిపైగానే చేశా. గతేడాది వరకూ రంజీ జట్టుకు కెప్టెన్‌గానూ ఉన్నా. నా నేతృత్వంలో రంజీల్లో రెండోస్థానంలో నిలిచాం.

ఇది నాన్న కల...

ఓపెనర్‌గా ఆంధ్రా రంజీ జట్టుకు చేసిన స్కోర్లు నన్ను ఇండియా రెడ్‌, ఇండియా గ్రీన్‌ జట్లకు ఎంపికయ్యేలా చేశాయి. నార్తర్న్‌ రైల్వేస్‌లో కొలువూ దక్కింది. ఈ రెండు విషయాలూ నా జీవితంలో మరచిపోలేను. ఉద్యోగమొచ్చినా ఆట కొనసాగిస్తున్నా. క్రీడా కోటా కాబట్టి సాధన, మ్యాచ్‌లకు ఇబ్బంది లేదు. 2020లో నా ప్రదర్శన తగ్గింది. మంచి స్కోర్లేమీ చేయలేకపోయా. దీంతో పూర్తిగా డీలాపడ్డా. అప్పుడు అమ్మానాన్న, స్నేహితులు అండగా నిలిచారు. వాళ్ల ప్రోత్సాహంతో పట్టుదలగా సాధన చేశా. ఏడాదిగా మంచి స్కోర్లు సాధిస్తున్నా. నాన్న కల నేను దేశానికి ప్రాతినిధ్యం వహించాలని! ఇప్పుడా పనిలోనే ఉన్నా. నిలకడగా రాణిస్తూ భారత జట్టులో స్థానం సంపాదించడం నా లక్ష్యం. ఆంధ్రా జట్టుకు ఆడాక కానీ, సొంతంగా క్రికెట్‌ కిట్టు కొనుక్కోవడం సాధ్యం కాలేదు. కొవిడ్‌ కారణంగా నాన్న టీ కొట్టు మూతపడింది. ఇప్పుడే ఒక దాబా తెరిచారు. అక్క పెళ్లి చేశాను, ఇల్లు కట్టడంలో ఆర్థికంగా సాయపడగలిగా. తమ్ముడి చదువు బాధ్యతా తీసుకున్నా.

సౌకర్యాలు బాగుంటాయని సాధనకు ఎక్కువగా వైజాగ్‌కు వెళ్తుంటా. ప్రతిసారీ 3-4 నెలలు అంటే ఇబ్బందే. నాలాంటి వాళ్ల కోసం ఏటా వేసవిలో కోచింగ్‌ క్యాంపు నిర్వహించి, క్రీడలపై ఆసక్తి ఉన్న యువతులకు సాయం చేయాలనుకుంటున్నా. అయితే దానికి ఇంకా సమయముంది.

ఇదీ చదవండి:

MEPMA: పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన 'మెప్మా'

ABOUT THE AUTHOR

...view details