Doctor Wrote Poems on YS Jagan: ఆయన ఒక ఉన్నతమైన వైద్యాధికారి. కానీ ఆయన మాత్రం అధికార పార్టీ నాయకుడిలా ముఖ్యమంత్రిని పొగుడుతూ కవితలు రాస్తున్నారు. అంతటితో ఆగలేదు ఆ వైద్యుడు. ప్రతిపక్షాలపై సైతం అభ్యంతరకర పదాలు వాడుతూ కవితలు రాశారు. కవితలు రాయడమే కాకుండా వాటిని ఫేస్‌బుక్‌తో పాటు వైద్య కళాశాల సిబ్బంది, వైద్యులు ఉండే వివిధ గ్రూపుల్లోనూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వైద్యుడి వ్యవహారశైలిపై.. సహోద్యోగులు చర్చించుకుంటున్నారు. ఉన్నతమైన వైద్యాధికారి అయి ఉండి ఇలా అధికారపార్టీ నాయకుడిలా వ్యవహరించడంపై విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆ కవితలు ఏంటి అనేగా మీ సందేహం.. మీరు కూడా చూడండి వాటిని..
నమ్ముతూ బతకాలిరా.. తమ్ముడూ.. నమ్ముతూ కదలాలిరా.. నమ్మకుంటే ఓటేయలేవురా.. ఓటేయకుంటే ఎంత ఏడ్చినా బతుకురాదురా.. తిరిగిరాదురా.. అందుకే జగనన్న మన నమ్మకమని.. నమ్ముతూ బతకాలిరా.. తమ్ముడూ.. నమ్ముతూ కదలాలిరా..
కర్నూలు వైద్య కళాశాలలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రభాకరరెడ్డి రాసిన కవితా పంక్తులివి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డిప్యుటీ సూపరింటెండెంట్‌గానూ పనిచేస్తున్న ఆయన ముఖ్యమంత్రిపై అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఈ కవితలు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రభాకరరెడ్డి తన ఫేస్‌బుక్‌తో పాటు వైద్య కళాశాల సిబ్బంది, వైద్యులు సభ్యులుగా ఉన్న అధికారిక గ్రూపుల్లోనూ ఈ తరహా పోస్టులు పెడుతున్నారు.
ప్రభాకర్‌రెడ్డి ఉన్నతస్థాయి వైద్యాధికారై ఉండి అధికార పార్టీ నాయకుడిలా ప్రవర్తిస్తుండటంతో సహోద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆదివారం విడుదల చేసిన కవితలో ముఖ్యమంత్రిని దేవుడితో పోల్చారు.