ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kurnool district road problems: ఇసుక లారీల బీభత్సం.. గుంతలతో దర్శనమిస్తున్న పల్లె రోడ్లు! - తుంగభద్ర తీరాన రోడ్ల పరిస్థితి

Kurnool district road problems : కర్నూలు జిల్లాలో తుంగభద్ర తీరాన నిబంధనలు భేఖాతరు చేస్తూ... ఇసుక లారీలను ఓవర్ లోడుతో నడుపుతున్నారు. ఫలితంగా పల్లె రోడ్లు మోకాల్లోతు గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఆయా గ్రామాలకు అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ప్రాణాలు పోతున్నాయి. రహదారి బాగాలేక... ఈ మార్గాల్లో ఆర్టీసీ సేవలు సైతం నిలిపివేశారు. కానీ అధికారులు మాత్రం ఇసుక లారీలపై చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు వాపోతున్నారు.

Kurnool district road problems, sand lorries overweight
తుంగభద్ర తీరాన ఇసుక లారీల ఓవర్​లోడ్

By

Published : Dec 12, 2021, 9:36 AM IST

తుంగభద్ర తీరాన ఇసుక లారీల ఓవర్​లోడ్

Kurnool district road problems : తుంగభద్ర తీరాన ఇసుక లారీలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిబంధనలు భేఖాతారు చేస్తూ ఓవర్ లోడుతో వాహనాలు నడుపుతున్నారు. ఫలితంగా పల్లె రోడ్లు మోకాల్లోతు గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఆయా గ్రామాలకు అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్లు అధ్వాన్నంగా తయారుకావడంతో ఆర్టీసీ సేవలను సైతం నిలిపివేశారు. ఇదీ కర్నూలు జిల్లా తుంగభద్ర నదీతీర గ్రామాల రోడ్ల పరిస్థితి.

నిత్యం 500 భారీ లారీలు

sand lorries overweight : జిల్లాలో తుంగభద్ర నదిలో 8 ఇసుక రీచ్​లకు అనుమతులిచ్చారు. కర్నూలు నగరానికి దగ్గరలోని సి.బెలగల్ మండలం పరిధిలో పలుదొడ్డి, ఈర్లదిన్నె, సింగవరం, ముడుమాల రీచ్​లు ఉన్నాయి. నిత్యం 500 భారీ లారీలతో ఇసుక తరలిస్తున్నారు. ఈ నాలుగు రీచ్​ల నుంచి ఇసుక ముడుమాల-పోలకల్లు రోడ్డులో కర్నూలుకు చేరుస్తున్నారు. నిబంధనలకు మించి 30 టన్నుల ఇసుక లారీల్లో తరలిస్తున్నారు. దీంతో ముడుమాల - పోలకల్లు 6 కిలో మీటర్ల రహదారిపై భారీగా గుంతలు పడ్డాయి. అలాగే పలుదొడ్డి నుంచి ముడుమాల వరకు పూర్తిగా దెబ్బతిన్నది. రెండేళ్ల క్రితం రూ.1.35 కోట్లతో చేపట్టిన ఆర్అండ్​బీ రహదారులు మట్టి రోడ్లను తలపిస్తున్నాయి.

బస్సు సర్వీసుల నిలిపివేత

Tungabhadra coast roads situation : కర్నూలు -మంత్రాలయం నదీ తీర గ్రామాలను కలుపుకుంటూ వెళ్లే బస్సు సర్వీసులు నిలిపివేశారు. బస్సులు గుంతల్లో పడి తరుచూ రిపేర్లకు వస్తున్నాయని... అధికారులతో తలనొప్పి ఎందుకని డ్రైవర్లు ఆ రూటులో వెళ్లడానికి జంకుతున్నారు. పలుదొడ్డి, ఈర్లదిన్నె గ్రామాల విద్యార్థులు ముడుమాలకు బసుల్లేక ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. అంబులెన్సులు ఈ రహదారిలో వచ్చేసరికి ప్రాణాలు పోతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్​కి తీసుకెళ్లడానికి రైతులు నరకం చూస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి

తుంగభద్ర తీరంలోని పలుదొడ్డి, ఈర్లదిన్నె, కె.సింగవరం రీచ్‌ల నుంచి లారీలు ముడుమాల మీదుగా పోలకల్లు- గూడూరు- కర్నూలుకు ఇసుక తీసుకెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం.. పది టైర్ల లారీ 25 టన్నులు, 12 టైర్లు 31 టన్నులు, 16 టైర్ల లారీ 35 టన్నుల బరువు తీసుకెళ్లాలి. బరువుపై 3 టన్నుల మార్జిన్‌ ఇచ్ఛి. అంతకన్నా ఎక్కువగా తీసుకెళ్తే కేసులు నమోదు చేయొచ్ఛు. రీచ్‌ల నుంచి 10 టైర్ల లారీ 30-32 టన్నుల ఇసుకతో వెళ్తున్నాయి. తడి ఇసుక కావడంతో మరింత బరువు ఉండటంతో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారుతున్నాయి.

రూటుమార్చుకొంటున్న బస్సు డ్రైవర్లు

కర్నూలు- తిమ్మందొడ్డి, ముడుమాల వయా మంత్రాలయం వరకు తుంగభద్ర తీర గ్రామాలకు నిత్యం మూడు బస్సు సర్వీసులు తిరిగేవి. ప్రస్తుతం భారీ గుంతలు ఏర్పడటంతో సర్వీసులు నిలిపివేశారు. బస్సులు మరమ్మతులకు గురైతే ఆర్టీసీ అధికారుల నుంచి తలనొప్పులు రావడంతో డ్రైవర్లు ‘రూటు’మార్చుకొంటున్నారు. పలుదొడ్డి, ఈర్లదిన్నె గ్రామాల్లోని 6-10వ తరగతి చదివే విద్యార్థులు ముడుమాల ఉన్నత పాఠశాలకు వెళ్తుంటారు.బస్సు సౌకర్యం నిలిపి వేయడంతో ప్రైవేటు వాహనాల్లో భయం గుప్పిట్లో ప్రయాణం చేస్తున్నారు.

అంబులెన్స్‌ రావడం జాప్యమై అన్న చనిపోయారు

మా అన్నకు వారం రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా గుంతల దారితో త్వరగా రాలేదు. ఆసుపత్రికి వెళ్లేటప్పుడు టిప్పర్లు ముందుకెళ్లడానికి దారివ్వకపోవడం, రోడ్డు బాగోలేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. దుమ్ములేచి, గుంతలతో వాహన చోదకులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఈర్లదిన్నె, సింగవరం రీచ్‌లకు వచ్చే లారీలు కొత్తకోట, సుంకేసుల మీదుగా కర్నూలు తరలిస్తే ట్రాఫిక్‌ తగ్గుతుంది.

- ఆంజనేయులు, ముడుమాల

గుత్తేదారుడికే వంతపాడుతున్నారు

గ్రామంలో ఉన్న ఇబ్బందులు దృష్ట్యా ఇసుక లారీలను ప్రజలంతా అడ్డుకొన్నాం. స్థానిక ఎస్సై గుత్తేదారుడికి వంతపాడుతూ వ్యవహరించిన తీరు ఆవేదన కలిగిస్తోంది. ఇసుక లారీలు తిరుగుతాయి.. ప్రజలే రోడ్లపైకి రావొద్దని చెప్పడం భావ్యం కాదు. రోడ్లు వేసిన తర్వాత లారీలు తిప్పాలని డిమాండు చేస్తుంటే.. ఎవరైనా చచ్చారా ? అని ఎస్సై అడుగుతున్నారు. స్థానిక పోలీసుల తీరుపై అవసరమైతే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాం.

- మద్దిలేటి, ముడుమాల

  • పలుదొడ్డి రీచ్‌ నుంచి ముడుమాల: 2.5 కి.మీ
  • ముడుమాల- పోలకల్లు రోడ్డు: 6 కి.మీ
  • 6 కి.మీ రోడ్డులో: 69 భారీ గుంతలు
  • ముడుమాల-పోలకల్లు ప్రయాణం (గతంలో)10-15 నిమిషాలు
  • ప్రస్తుతం: 30 నిమిషాలు పైమాటే!
  • ఒక గంటలో వెళ్తున్న డంపర్లు, లారీలు: 50
  • ఈ రోడ్డులో నిత్యం తిరుగుతున్నవి 500పైగా లారీలు

ఇదీ చదవండి:saiteja Funeral: నేడు లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details