ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదాయ లక్ష్యాలు దాటిన మార్కెట్ యార్డులు - కర్నూలు జిల్లాలో మార్కెట్ యార్డులు

కర్నూలు జిల్లాలో మార్కెట్ యార్డులు ఆదాయ లక్ష్యాలను దాటేశాయి. వీటి ఆదాయార్జనపై లాక్ డౌన్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. పంటలు బాగా పండటం, గిట్టుబాటు ధరలు లభించడం వలన యార్డులు కళకళలాడాయి.

kurnool district agricultural market yards
కర్నూలు జిల్లా మార్కెట్ యార్డులు

By

Published : Jul 4, 2020, 9:20 AM IST

కర్నూలు జిల్లాలో నాలుగేళ్లుగా లక్ష్యాలు అధిగమించడంలో చతికిలబడిన వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ప్రస్తుతం ఆదాయ ఆర్జనలో దూసుకెళ్లాయి. ఆర్థిక సంవత్సరం చివరిలో కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ పెట్టినా ఏమాత్రం ప్రభావం పడకపోవడం గమనార్హం. పంటలు బాగా పండటంతోపాటు గిట్టుబాటు ధరలు కల్పించినందున యార్డులు కళకళలాడాయి. జిల్లాలో మొత్తం 12 మార్కెట్‌ యార్డులకు 2019-20 ఏడాదికి రూ.43.98 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా, 104.14 శాతంతో రూ.45.80 కోట్లు రాబట్టాయి. 2018-19లో పరిశీలిస్తే రూ.38.19 కోట్ల ఆదాయమే దక్కింది.

జిల్లాలో ప్రధానంగా పత్తి, వేరుశనగ, వరి, వాము, టమోటా, ఉల్లి, ఆముదం, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, పశువుల సంత తదితర వ్యాపారాలు సాగుతాయి. సీజన్‌ బాగుంటే ఎంత లేదన్నా ఏటా రూ.5 వేల కోట్ల దాకా వ్యాపారాలు నడుస్తాయి. ఈసారి పత్తి, వేరుశనగ, పప్పు ధాన్యాలు, ఉల్లి, టమోటా తదితరాల సాగు బాగుండటంతో యార్డులకు సరకు పోటెత్తింది. దీంతో దిగుబడి అమ్మకాలపై ఒక్క శాతం సెస్సు ద్వారా ఆదాయం సమకూరింది. ఆదోనిలో పత్తి, పత్తికొండలో టమోటా, పశువుల సంత, నందికొట్కూరు, బనగానపల్లి, కోవెలకుంట్ల, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు, మొక్కజొన్న దిగుబడి బాగా రావడం, ఆలూరు వంటి ప్రాంతంలో జొన్న సాగు ఊపునిచ్చాయి.

వెనుకబాటు అందుకే..

కర్నూలు యార్డులో ఉల్లి, వేరుశనగ, వాము, పప్పు ధాన్యాలు తదితరాలను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేశారు. దీని వల్ల సెస్సు మినహాయింపు ఇవ్వటంతో రూ.7 కోట్ల లక్ష్యంలో రూ.5.68 కోట్ల ఆదాయంతో 81.20%తో వెనుకబడ్డారు. ఇక నంద్యాల ప్రాంతంలో 2018 ఏప్రిల్‌లో అధిక వర్షాలకు వరి పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. నంద్యాల మార్కెట్‌ 10 శాతం వెనుకబడటానికి వరి ప్రభావం చూపింది. అనుకున్నంత స్థాయిలో దిగుబడులు రాక రూ.8.90 కోట్ల లక్ష్యానికి గాను, రూ.8.05 కోట్ల ఆదాయం పొంది కాస్త తడబడింది.

కొత్త గోదాములు మంజూరు

జిల్లాలో ఉన్న 12 మార్కెట్‌ యార్డులతోపాటు... కోడుమూరు, పాణ్యం, మంత్రాలయంలో మరో 3 యార్డులు కొత్తగా ఏర్పాటు చేశారు. మార్కెట్‌ యార్డుల్లో 46 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 13 గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికోసం ఏఎంఐఎఫ్‌(అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) కింద రూ. 27 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్లు పూర్తయి గుత్తేదారులకు పనులు అప్పగించారు. జిల్లాలో వేర్‌హౌస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(డబ్ల్యూఐఎఫ్‌) కింద 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 89 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు జిల్లా మార్కెటింగ్‌ శాఖ చేసింది.

సమష్టి కృషితోనే సాధ్యమైంది

'2019-20 ఏడాదిలో మార్కెట్‌ యార్డులు ఆదాయ లక్ష్యాలు దాటడం అందరి సమష్టి కృషితోనే సాధ్యమైంది. సీజన్‌ ఆరంభం నుంచే దిగుబడులు ఊపందుకోవడం, ధరలు బాగుండటం వంటివి కలిసొచ్చాయి. దీనివల్ల యార్డులకు సెస్సు రూపంలో ఆదాయం వచ్చి చేరింది. మున్ముందు మంచి ఫలితాలు సాధించేలా లక్ష్యాలు నిర్దేశించుకోనున్నాం.' - సత్యనారాయణ చౌదరి, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ

ఇవీ చదవండి..

ప్రత్యేక జెండా.. ఒకటే ఎజెండా.. 200 రోజులుగా రెప్పవాల్చని పోరు

ABOUT THE AUTHOR

...view details