కర్నూలు నగరం కొత్త అందాలను సంతరించుకుంటోంది. నగరంలోని పలు కూడళ్లు చూడచక్కగా ముస్తాబవుతున్నాయి. గోడలపై వర్ణ చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తుంగభద్ర పుష్కరాల నిధులతో..నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
తుంగభద్ర పుష్కరాల సమయంలో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును అందంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1.90 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. పుష్కరాలు సమీపిస్తున్నవేళ నిధులు రావటంతో... పలు సుందరీకరణ పనులు ఆలస్యం అయ్యాయి.
పుష్కరాలకు ముందు కేవలం స్వాగత తోరణాలు సహా కొన్ని అత్యవసర పనులు మాత్రమే చేపట్టారు. మిగిలిపోయిన పనులన్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. విహార్, ఐదురోడ్లు, కిడ్స్ వరల్డ్, రైల్వేస్టేషన్ సమీపంలోని కూడళ్లలో ఏర్పాటు చేసిన వివిధ కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. జలమండలి, బళ్లారి చౌరస్తా, పంప్ హౌస్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గోడలపై వేసిన వర్ణచిత్రాలు ఔరా అనిపిస్తున్నాయి. పచ్చదనంలో భాగంగా... డివైడర్ల మధ్యలో నాటిన వివిధ రకాల మొక్కలు కనువిందు చేస్తున్నాయి.