రాయలసీమ ప్రాంత దుర్భిక్షాన్ని, దాహార్తిని తీర్చేందుకు, మరో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సన్నాహాలు మొదలుపెట్టామని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బృందానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 796 అడుగుల వద్దే విద్యుత్తు కోసం నీటిని వాడేస్తోందని, 800 అడుగుల వద్దే నీటిని ఎత్తిపోయడానికి, ఎలాంటి అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముమ్మరంగా నిర్మిస్తోందని ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న నేపథ్యంలో... కన్వీనర్ డి.ఎం.రాయపురే ఆధ్వర్యంలో కేఆర్‌ఎంబీ బృందం బుధవారం రాయలసీమలో పర్యటించి, ప్రాజెక్టులను పరిశీలించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి కారణాలను జలవనరులశాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, కర్నూలు జిల్లా చీఫ్ ఇంజినీరు మురళీనాథ్‌రెడ్డి... కేఆర్‌ఎంబీ బృందానికి వివరించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం 800 అడుగుల స్థాయిలోనే దిండి ప్రాజెక్టుని కూడా చేపట్టింది. కల్వకుర్తి ప్రాజెక్టుని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు విస్తరింపజేస్తోంది. వాటికి ఎలాంటి అనుమతులూ లేవు. మరో పక్క ప్రాజెక్టులు 854 అడుగుల వరకు జలాలు ఉంటే తప్ప... కనీసంగా 6 వేల క్యూసెక్కుల నీటినైనా పోతిరెడ్డిపాడు నుంచి తరలించే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కి లేదు. 881 అడుగులు ఉంటే తప్ప... పోతిరెడ్డిపాడు నుంచి నీటిని పూర్తి స్థాయిలో తీసుకుని దుర్భిక్ష జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు అందించలేం. చెన్నైకి కూడా తాగునీటిని సరఫరా చేయలేం. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే రాయలసీమ కరవు నివారణ కోసం ఆ ప్రాజెక్టు ఆలోచన చేశాం...’’ అని వారు వివరించారు. ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ కోసం ఎన్జీటీ అనుమతి ఇచ్చిందని, దీనికి లోబడి టెండరు పిలిచామని తెలిపారు. ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నామన్నారు. కేఆర్‌ఎంబీ కమిటీ కన్వీనర్ డి.ఎం.రాయపురే, సభ్యులు ఎల్.బి.మౌతంగ్, దర్పన్ తల్వార్ మొదట ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అనంతరం పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.
హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకే....