‘కరోనా పాజిటివ్ అనగానే ఆందోళన చెందొద్ధు ఆక్సిజన్‌స్థాయి 94కు పైగా ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరముండదు. హోం ఐసొలేషన్ (స్వీయ గృహ నిర్బంధం)లో ఉండండి. అత్యవసర పరిస్థితి ఉంటేనే ఆసుపత్రి గడప తొక్కండి.. లేదంటే ఇల్లే సురక్షితం’. - ప్రభుత్వ వైద్యాధికారుల సూచన
స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. నిరంతరం పర్యవేక్షించాల్సిన సిబ్బంది జాడే కానరావడం లేదు. వైద్య చికిత్స నిమిత్తం ఇవ్వాల్సిన ‘కొవిడ్ కిట్లు’ ఏమాత్రం అందడం లేదు. విధిలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. - బాధితుల ఆవేదన
కర్నూలు జిల్లాలో మార్చి నుంచి కరోనా రెండో వేవ్ మొదలైంది. మే 16 నాటికి కేసుల సంఖ్య ఏకంగా 40,316 నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మృతుల సంఖ్య సైతం రెండున్నర నెలల్లో 150కి చేరింది. వైరస్ ఉద్ధృతితో కుటుంబంలో ఒకరిద్దరేకాక సభ్యులంతా కరోనా బారిన పడుతున్నారు. ఈ సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లే సహాయకులు లేక ఎక్కువ మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉండి చికిత్స పొందేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఈనెల 5వ తేదీ నాటికి హోం ఐసొలేషన్‌లో 7,614 మంది ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా కర్నూలులో హోం ఐసొలేషన్‌లో ఉండగా, అత్యల్పంగా ఆదోనిలో ఉన్నట్లు సమాచారం.
తార్కాణం ఎందరో...
కర్నూలు నగరంలోని చాణక్యపురి కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబంలో భార్యాభర్తకు గత నెల 22వ తేదీ లక్షణాలు కనిపించడంతో సర్వజన వైద్యశాలలో పరీక్షలు చేయించారు. 23వ తేదీ సాయంత్రం వైద్య సిబ్బంది పాజిటివ్‌గా నిర్ధారణ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం) చరవాణిలో సంప్రదించి కొవిడ్ కిట్టు అందిస్తామని తెలిపారు. రోజులు గడుస్తున్నా ఏఎన్‌ఎం ఫోన్ చేయలేదు సరికదా.. ఇంటి వైపు చూడలేదు. చేసేది లేక ఓ వైద్యుడిని సంప్రదించి బహిరంగ మార్కెట్‌లో సొంత ఖర్చులతో మందులు కొనుగోలు చేసి 15 రోజులపాటు క్వారంటైన్ అయ్యారు.
నంద్యాల పట్టణంలోని ఓ కుటుంబంలో ఇద్దరు కొవిడ్ బారిన పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించినప్పటికీ ఆరోగ్య కార్యకర్త సంప్రదించడంకానీ, కొవిడ్ కిట్టు అందడం కానీ జరగలేదు. చివరికి బంధువుల సాయంతో వైద్యుల సూచన మేరకు ఐవర్ మెక్టిన్, యాంటీ బయాటిక్ (డాక్సీ), విటమిన్ మాత్రలు, సి-విటమిన్, డి-విటమిన్ తదితరాలను కొనుగోలు చేయగా ఒక్కొక్కరికి రూ.1,250 చొప్పున రూ.2,500 ఖర్చైంది. ఏఎన్‌ఎంల పర్యవేక్షణ లేకపోవడంతో పల్స్ ఆక్సీమీటరును సొంతగా కొనుగోలు చేసి పరీక్షించుకుంటూ మందులు వాడి నయం చేసుకున్నారు.