ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KC Canal: ఘన చరిత్ర కలిగిన కేసీ కెనాల్​.. నేడు మురికి కూపంలా

KC Canal: ఎంతో ఘన చరిత్ర కలిగిన కాల్వ అది. రెండు జిల్లాలకు తాగు, సాగునీరు అందించే కెనాల్ అది. ఎంతో ప్రాధాన్యత ఉన్న కాల్వ నేడు.. మురికి కూపంలా మారి.. దుర్గంధం వెదజల్లుతోంది. మురుగునీరు, వ్యర్థాలతో.. డ్రైనేజీని తలపిస్తోంది. కర్నూలు నగరం మీదుగా ప్రవహించే.. కెసీ కెనాల్.. దుస్థితిపై కథనం.

KC Canal
KC Canal

By

Published : Jun 2, 2023, 6:24 AM IST

ఘన చరిత్ర కలిగిన కేసీ కెనాల్​.. నేడు మురికి కూపంలా

KC Canal: వేల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందించే ఎంతో ఘన చరిత్ర కలిగిన కేసీ కెనాల్‌.. నేడు మురికికూపంలా మారిపోయింది. చెత్తాచెదారంతో పాటు ఇతర వ్యర్థాలు పడేయడంతో మురుగునీటి కాలువ కన్నా దారుణంగా తయారైంది. కెనాల్‌ నుంచి వచ్చే దుర్గంధంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల బాధతో రోగాల బారిన పడుతున్నారు. కర్నూలు నగరం మీదుగా ప్రవహించే కెసీ కెనాల్‌ ప్రస్తుత దుస్థితిపై ప్రత్యేక కథనం.

రాయలసీమ వరప్రదాయిని, కర్నూలు, కడప జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే ప్రధాన కాలువ కేసీ కెనాల్‌.. మురుగు కాలువను తలపిస్తోంది. ఇప్పటికీ ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల పరిధిలోనే వేలాది గ్రామాల తాగునీరుకు ఈ కాలువే దిక్కు. లక్షలాది మంది ప్రజలకు రక్షిత మంచినీటిని అందించే కేసీ కెనాల్‌ కర్నూలు నగరం మీదుగా వెళ్తోంది. ఈ క్రమంలో నగరంలోని చెత్తాచెదారంతో పాటు మురుగు నీటి కాల్వలను కేసీకెనాల్‌లోకి వదలడంతో మురుగుకూపంలా మారిపోయింది. సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు పడిపోవటం, పంటలు సైతం లేకపోవటంతో.. కేసీ కెనాల్‌కు నీటి విడుదలను ఆపేశారు. దీంతో చెత్తాచెదారంతో కాలువ నిండిపోయింది.

"దీనిపై అధికారులు ఫిర్యాదు చేశాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు 15రోజులు అయినా ఇంతవరకూ ఇటువైపు రాలేదు. చెత్త సేకరించేవాళ్లు పదిన్నరకు వస్తారు. అప్పటిలోపు ఇక్కడ ఉన్న వారు అందరూ పనుల్లోకి వెళ్తారు. ఆ సమయంలో వస్తే ఎవరూ ఉండరు. అందువల్ల అందరు చెత్త తీసుకెళ్లి కెనాల్​లో పడేస్తారు. దీంతో దోమల బెడద, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వారు కూడా చెత్త తీసుకొచ్చి ఇక్కడే పడేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్లకి ఫోన్​ చేస్తే వస్తారు.. తప్పించి మిగతా సమయాల్లో రారు. పన్ను రూపాన ఒక్కొక్కరికి 120 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటు డబ్బులు పోతున్నా.. కాల్వ మాత్రం శుభ్రం మాత్రం కావడం లేదు"-స్థానికులు

కర్నూలు నగరంలో కేసీ కాల్వకు ఇరువైపులా వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మురుగునీరు, వ్యర్థాలతో కాల్వ నిండిపోవటంతో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. దుర్గంధం భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దోమల ఎక్కువ కావడంతో విష జ్వరాల బారిన పడుతున్నామన్నారు. చెత్తపన్ను కడుతున్నా నగరపాలక సంస్థ అధికారులు కెనాల్‌ను శుభ్రం చేయడం లేదని వాపోతున్నారు.

"చెత్తబండ్లు మాడు నాలుగు రోజుల పాటు రావు. అందువల్లే చాలా మంది చెత్త తీసుకెళ్లి అక్కడ పడేస్తున్నారు. వేరే ఎక్కడా స్థలం లేకపోవడం, చెత్త బండ్లు టైంకి రాకపోవడం వల్ల చెత్త అక్కడ వేస్తున్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను అన్ని పన్నులు కడుతున్నాం. దోమలు విపరీతంగా ఉన్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కాల్వలోకి నీళ్లు విడిచి పెట్టే ముందు కాల్వ శుభ్రం చేస్తారు"-స్థానికులు

కొన్నేళ్ల క్రితం వరకు కెనాల్‌ నీళ్లు తాగేవాళ్లమంటున్న స్థానికులు.. ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నగరపాలక సంస్థ, జలవనరుల శాఖ అధికారులు వెంటనే కాలువను శుభ్రం చేయడంతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాల వారు చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details