కర్నూలు జిల్లా కౌతాళం, కోసిగి, మంత్రాలయం, ఆదోనికి సంబంధించిన పెద్దహరివాణం, హాలహర్వి, హోళగుంద మండలాల పరిధిలోని పలు పంచాయతీలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి. కౌతాళానికి చెందిన ఏడు గ్రామాల్లో 8,437 ఓటర్లు, కోసిగికి సంబంధించిన ఆరు గ్రామాల్లో 9,733 మంది ఓటర్లు ఉన్నారు. ఆదోని పెద్దహరివాణంలో 5,721 ఓటర్లు, హాలహర్వి గూళ్యం(7,847), సిద్ధాపురం(2,183), విరుపాపురం(2,438), చింతకుంట(4,650), సాకిబండ(1,060), హోళగుంద పరిధిలోని నాలుగు పంచాయతీల్లో 7,060 మంది కన్నడ సరిహద్దు ఓటర్లు ఉన్నారు.
దేవాలయాల అభివృద్ధికి హామీలు:
ఈ మండలాల పరిధిలోని గ్రామాల్లో కన్నడ మాట్లాడటంతోపాటు, ఆచార సంప్రదాయాల్లోనూ ధార్మికత ఎక్కువ. ప్రతి ఇంటి నుంచి వంద శాతం భక్తులు ఆలయాలకు వెళ్తుంటారు. ఈ కారణంగా ఆయా పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థులు.. దేవాలయాల అభివృద్ధి, మండపాల నిర్మాణాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు హామీలిచ్చి ఓట్లు రాబట్టే యత్నాలు చేస్తున్నారు. సరిహద్దులోని నదీతీర గ్రామాల్లో రైతుల మోటార్ల కోసం విద్యుత్తు, పైపులైన్ల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. విద్యుత్తు పరివర్తకం(ట్రాన్స్‌ఫార్మర్) మరమ్మతులకు గురైతే వెంటనే ప్రత్యామ్నాయం చేసేందుకు సహాయపడే గ్రామ నాయకులపై రైతు ఓటర్లకు గురి ఉంటుంది. ఇలాంటివి పరిష్కరించే పట్టున్న అభ్యర్థులకు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపడం పరిపాటి.