ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని ముఖం చాటేసిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఏం జరిగిందంటే:
ఉలిందకొండ, ప్యాపిలి, పెరవలి గ్రామాలకు చెందిన ఐదుగురు నిరుద్యోగులకు ఓ ముఠా ఎర వేసింది. ఎంబీఏ, డిగ్రీ చదవిన శరత్‌బాబు, వినోద్‌కుమార్, నాగన్న, ప్రసన్న, బీఈడీ చేసిన సుధాకర్ ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. తొలుత నాగన్నకు అందిన విజటింగ్ కార్డులోని చరవాణి నెంబర్‌కు సంప్రదించగా నవీన్‌కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని, తన సొంత ఊరు నందికొట్కూరు అని తెలిపారు. వాట్సప్ ఐడీ చిత్రం ఓ రాజకీయ నేతది పెట్టుకున్నారు. దీంతో అతని మాటలు నమ్మి ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్నారు.
బంగారంపై రుణం అందించే ఓ ప్రైవేటుకంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. పీజీ చదివిన వారికి క్యాషియర్ పోస్టుకు 25 వేల రూపాయల జీతం, డిగ్రీ చదివిన వారికి గోల్డ్ అనలిస్టు పోస్టుకు 19 వేల రూపాయల జీతం ఇస్తామని నమ్మబలికారు. ఇంటర్వ్యూలు ఎప్పుడనేది హైదరాబాద్ నుంచి రాజు అనే వ్యక్తి ఫోన్ చేస్తాడని చెప్పారు. అదే విధంగా ఫోన్ కాల్ రావడంతో ఉద్యోగాలు నిజమేనని నమ్మిన నిరుద్యోగులు వేరువేరుగా నగదు బదిలీ చేశారు.