సొంత రాష్ట్రాలకు పంపించాలని కార్మికుల విజ్ఞప్తి - కర్నూలు జిల్లాలోని జిందాల్ పరిశ్రమ కార్మికుల న్యూస్
లాక్డౌన్ వల్ల పనుల్లేక, సొంత రాష్ట్రాలకు వెళ్లే మార్గం లేక చిక్కుకుపోయిన వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటొచ్చి ఇప్పుడు తినేందుకు గుప్పెడు మెతుకులు దొరక్కా కంటతడి పెడుతున్నారు. కర్నూలు జిల్లా గడివేములలోని జిందాల్ పరిశ్రమలో ఇతర రాష్ట్రాలకు చెందిన 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు వారంతా తమను సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.
![సొంత రాష్ట్రాలకు పంపించాలని కార్మికుల విజ్ఞప్తి సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ కార్మికుల ఆవేదన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7047546-848-7047546-1588522311189.jpg)
కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని జిందాల్ పరిశ్రమలో ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత నెలరోజులుగా పనులు లేక ఖాళీగా ఉన్నామంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ వారు అందించిన సరకులతో ఇంతకాలం గడిపామని... ఇప్పుడు పూట గడిపేందుకు చాలా కష్టంగా ఉందని వాపోయారు. సొంత గ్రామాలకు వెళ్లడానికి చేతిలో డబ్బులు లేవని గోడు వెళ్లబోసుకున్నారు. పరిశ్రమలో చేర్పించిన ఏజెన్సీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై దయుంచి సొంత రాష్ట్రాలకు పంపించాలని కార్మికులు కోరుతున్నారు.