పంపిణీకి సిద్ధం చేసిన స్కూల్ బ్యాగులు
కర్నూలు జిల్లాలో గతేడాది ప్రతిపాదనల ప్రకారం 54 మండలాల్లోని 2,944 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 4,75,605 మందికి కిట్లు మంజూరయ్యాయి. పథకాన్ని స్థానిక ఏ.క్యాంపులోని ఇందిరాగాంధీ పురపాలక పాఠశాల ఆవరణలో ప్రజాప్రతినిధుల చేతులు మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి ఒక్కరికి కిట్‌లో మూడు జతల సమదుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, రాత పుస్తకాలు, స్కూల్ బ్యాగు సిద్ధం చేశారు. తదుపరి తరగతుల్లోకి ప్రవేశించిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా సిద్ధం చేసిన కిట్లను మండల రిసోర్స్ కేంద్రాలు, పాఠశాలలకు పంపారు. ఇప్పటికే పాఠశాలలకు 92 శాతం పాఠ్య పుస్తకాలను చేరవేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం పదేపదే వాయిదా పడుతూ వస్తోంది. సెప్టెంబరు 21 నుంచి 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు తమతమ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పాఠ్యాంశాల్లో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
గతేడాది ప్రతిపాదనలు
లాక్‌డౌన్ కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారంతా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. విద్యాకానుక కిట్లకు ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా గతేడాది విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని విద్యాధికారులు ప్రతిపాదనలు పంపారు. అందరికీ జగనన్న విద్యాకానుక కిట్లు అందే పరిస్థితి లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. మొదటి దశలో షూ, సాక్సులు మాత్రమే ఇండెంట్ ప్రకారం పూర్తిస్థాయిలో చేరాయి. మిగిలిన వస్తువులు తక్కువగా ఉన్నాయి. పెద్దసంఖ్యలో రాత పుస్తకాలు రావాల్సి ఉంది.
ఆందోళనలో గురువులు
ఒక్కో విద్యార్థికి మూడు జతల సమదుస్తులు ఇస్తామని ప్రకటించిన అధికారులు పాఠశాలలకు రెండు జతలే వచ్చాయి. జిల్లాకు వచ్చిన షూ(బూట్లు)ను పాఠశాలలకు చేరవేసినా...కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి అందరికీ కిట్లు అందుతాయా? లేదా? అన్న సందేహాలు ఉపాధ్యాయుల్లో నెలకొన్నాయి. నగరంలోని పురపాలక పాఠశాలల్లో గత ఏడాది 6-10వ తరగతి వరకు 1250 మంది ఉండగా...ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల నుంచి మరో 150 మందికి పైగా అదనంగా వివిధ తరగతుల్లో చేరనున్నారు. ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఉన్న సంఖ్య ఆధారంగా సామగ్రి పంపిణీ చేయనుండటంతో అదనంగా చేరిన వారికి ఎప్పటికీ అందుతాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విద్యార్థులకు అందించే సమదుస్తుల కుట్టుకూలి సరిపోదని, దాన్ని పెంచి అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒక జతకు రూ.40 ఇస్తున్నారని, ఆ మొత్తం ఎక్కడ సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి