భావితరాల భవిష్యత్తుపై దృష్టి సారించి.. 10-15 ఏళ్ల వయసులోనే ప్రపంచంతో పోటీపడి మన పిల్లలు నెగ్గుకురావాలన్న ఆలోచనతో విద్యా వ్యవస్థలో మార్పులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన విద్యనందించి పిల్లల తలరాతలు మారేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
‘ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 47 లక్షల మంది విద్యార్థులకు రూ.931 కోట్లతో జగనన్న విద్యా కానుక అందిస్తున్నాం. పేదరికం నుంచి బయటపడేలా మెరుగైన ఆంగ్ల చదువులుండాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో ఎక్కడైనా బతికే శక్తి వస్తుంది. ఇందులో
భాగంగానే క్రమం తప్పకుండా మూడేళ్లుగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నాం. ఉద్యమంలా సర్కారు బడుల్లో ‘నాడు-నేడు’ కింద మార్పులు చేపడుతున్నాం. గతంలో ఏ పాలకులూ ఆలోచించని విధంగా జగనన్న గోరుముద్ద పథకంతో పౌష్టికాహారాన్ని
విద్యార్థులకు అందిస్తున్నాం.
ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చి ద్విభాషా పుస్తకాలతోపాటు, మెరుగైన చదువులకు శ్రీమంతుల పిల్లలు రూ.24వేలు చెల్లించి చేరే బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని యాప్ అందుబాటులోకి తెస్తున్నాం. విద్యా కానుక ఖర్చు ఏటా పెరుగుతూ పోతున్నా.. ఎక్కడా వెనకడుగు వేయకుండా మేనమామగా పిల్లలకు అందజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
బైజూస్‌తో ఒప్పందం..‘ఎనిమిదో తరగతిలోకి అడుగుపెడుతున్న దాదాపు 4.70 లక్షల మంది విద్యార్థులకు రూ.12వేల విలువైన ట్యాబ్‌లను సెప్టెంబరులో పంపిణీ చేస్తాం. బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుని ట్యాబ్‌లకు అనుసంధానం చేసి 2025 మార్చిలో విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాసి మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక రచిస్తున్నాం. విద్యా కానుక కిట్లతోపాటు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు అందిస్తున్నాం.
పాఠశాలలు తెరవగానే పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బ్యాగు కొనాలనే ఆలోచనతో తల్లిదండ్రులు ఇబ్బందిపడకూదనే విద్యా కానుక కిట్లు అందజేస్తున్నాం. రాష్ట్రంలో బడిమానేసే పిల్లలు తగ్గడానికి, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. ఈతరం, భావితరం పేదరికమనే సంకెళ్లను తెంచుకోవాలి. సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గాలి. ఉన్నత, ఆంగ్ల మాధ్యమ చదువులు పేదింటి పిల్లలకు అందాలి. విద్యా విప్లవంతో రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఆనందం, అభివృద్ధి చూడగలం. ఇదే నా సంకల్పం’ అని వివరించారు.
విద్యా రంగంలో 9 పథకాలు
‘గత ప్రభుత్వ హయాంలో 2018-19లో సర్కారు బడుల్లో 1-10వ తరగతి వరకు 37.10 లక్షల మంది చదవగా.. 2021-22లో 44.30 లక్షలకు పెరిగారు. 7.20 లక్షల మంది ప్రైవేటు బడులు మానేసి ప్రభుత్వ బడుల్లో చేరారు. విద్యా రంగంలో 9 ప్రధాన పథకాలను అమలు చేస్తున్నాం. నాడు-నేడు, విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, అమ్మ ఒడి, ఆంగ్ల చదువులు, విద్యా దీవెన, వసతి దీవెనతోపాటు తొమ్మిదోది బైజూస్‌తో ఒప్పందం’ అని పేర్కొన్నారు.