IT NOTICES TO MINISTER GUMMANURU : ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆదాయపన్ను శాఖ నోటీసులు కలకలం రేపాయి. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సతీమణి రేణుకకు మరోసారి ఐటీశాఖ నోటీసులు జారీ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత నెల ఫిబ్రవరి 14న ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. కార్మిక శాఖ మంత్రి జయరాం దంపతులతో పాటు ఆలూరు సబ్ రిజిస్ట్రార్‌కు కూడా నోటీసులు పంపింది. 2019లో అఫిడవిట్లో భార్య పేరిట ఎలాంటి ఆస్తులు చూపని గుమ్మనూరు 2020లో భార్య పేరులో రూ. 52 లక్షల రూపాయలతో 30 ఎకరాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆదాయం లేకపోయినా.. ఆస్తులు ఎలా గొన్నారని గతంలో ఐటీ గతంలోనే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే తమ నోటీసులకు సమాధానం చెప్పకపోతే ఆస్తులు అటాచ్ చేస్తామని ఐటీ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈనెల 17 లోగా సమాధానం చెప్పాలని ఐటీ శాఖ నోటీసుల్లో కోరినట్లు తెలుస్తుంది. నేరుగానైనా లేదంటే ఏప్రిల్ మూడున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానం చెప్పాలని ఐటీ తన నోటీసుల్లో వెల్లడించింది.
ఇవీ ఆరోపణలు: మంత్రి జయరాం తన భార్య పేరు మీద 30.83 ఎకరాలు 2020 మార్చిలో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్టరైన సర్వే నంబర్లరో (674/E, 729, 688/2, 668/సి, 689/సి, 713/ ఏ) ఇట్టినా కంపెనీ కన్వర్షన్ చేయించిన జాబితాలోనే ఉంది. వీటిని మంత్రి జయరాం వ్యవసాయ భూములుగా చూపించారు. అనంతరం వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్పరిలో మాములుగా అయితే వ్యవసాయేతర భూమి ఎకరా విలువ 20.33 లక్షల నుంచి 38.72 లక్షలు ఉంది. మెట్టభూమి విలువ 3లక్షలుగా ఉండగా... వ్యవసాయ భూములుగా చూపినందున 7.5శాతం స్టాంపు డ్యూటీగా.. ఎకరాకు రూ.22,500 చొప్పున చెల్లించినట్లు అవుతుంది.