శ్రీశైలం దేవస్థానంలో కోట్ల రూపాయల అవినీతి వ్యవహారంపై ముమ్మరంగా విచారణ జరుగుతోంది. కోట్ల రూపాయలు పక్కదారి పట్టిన వైనాన్ని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్, ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు వేర్వేరుగా విచారణ చేస్తున్నారు. టిక్కెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్ల విషయంలో గత మూడేళ్లలో సుమారు కోటీ 42 లక్షల రూపాయల అవినీతి జరిగిందని తేల్చారు. బుధవారం భ్రమరాంబ అతిథి గృహంలో... టెంపుల్ విభాగం, పెట్రోల్ బంకు, పరిపాలనా విభాగం, వసతి విభాగం, టోల్గేట్లకు సంబంధించిన వివరాలు సేకరించారు. అందుబాటులోని సిబ్బందిని విచారించారు.
పెట్రోల్ బంకులో 40 లక్షల రూపాయలు దుర్వినియోగం కావటంతో 2016 నుంచి పనిచేసిన ఏఈవోలు, పర్యవేక్షకులు, గుమాస్తాల వివరాలను తీసుకొని విచారిస్తున్నారు. బ్యాంకుల తరఫున పనిచేసిన పొరుగు సేవల సిబ్బంది అత్యంత చాకచక్యంతో సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆంధ్రా బ్యాంకు తరఫున వచ్చిన ప్రతినిధులకు దేవస్థానం అధికారులు అక్రమాల తీరును వివరించారు.