కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఈ పథకం కింద 94 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. లింగాపురం, జీసీపాలెం గ్రామాల్లో 22 మంది అర్హత పొందారు. అయితే వీరిలో ఇతర సామాజికవర్గాల వారి పేర్లూ చేరినట్లు 15 రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శిరీష స్పందించారు. పూర్తి విచారణ జరిపి ఈ నెల 1లోపు నివేదిక ఇవ్వాలని ఎంపీడీవో వాసుదేవ గుప్తాను ఆదేశించారు. ఎంత మంది అనర్హులు లబ్ధి పొందారో గుర్తించాలన్నారు. వారి నుంచి డబ్బులు రికవరీ చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు.
నత్తనడకన విచారణ
జిల్లా అధికారుల ఆదేశాలతో స్థానిక అధికారులు విచారణ ప్రారంభించారు. ఇతర సామాజికవర్గానికి చెంది కాపునేస్తం కింద లబ్ధి పొందిన 15 మందికి నోటీసులిచ్చారు. అయితే వీరు డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ గ్రామంలో ఇతర పథకాల కింద కూడా పదుల సంఖ్యలో అనర్హులు లబ్ధి పొందారని వారు చెబుతున్నారు. వారి నుంచి రికవరీ చేస్తే.. తామూ కాపునేస్తం డబ్బులు వెనక్కు ఇస్తామంటున్నారు. దీంతో అధికారులు తేనెతుట్టెను కదిలించడం ఎందుకని విచారణ, రికవరీని అటకెక్కించినట్లు తెలుస్తోంది.