రాయలసీమ విశ్వవిద్యాలయంలో టీచింగ్ విభాగంలో 59 పోస్టులకుగాను 49 మందిని కాంట్రాక్టు (ఒప్పంద), నలుగురిని ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) కింద భర్తీ చేశారు. బోధనేతర సిబ్బంది విభాగంలో ఉన్న 131 మంది కాంట్రాక్టు సిబ్బందిలో 105 మంది మినిమం టైం స్కేల్ కింద పనిచేస్తున్నారు. మిగిలిన వారిని అవుట్‌సోర్సింగ్ కింద భర్తీ చేశారు. మినిమం టైం స్కేల్ కింద అర్హత సాధించిన వారంతా అప్పట్లో సిఫార్సులతో వచ్చినవారే. టైం స్కేల్ నుంచి రెగ్యులర్‌గా నియామకమైన నలుగురికి సంబంధించి రోస్టర్, వయస్సును పరిగణలోకి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒకరు, గ్రంథాలయ సహాయకులు ఒకరు, పరీక్షల నియంత్రణాధికారి, ఇంజినీరింగ్ విభాగంలో ఒకరు.. ఇలా మొత్తం ఏడుగురు ఉద్యోగ నియామక అర్హత వయస్సు దాటినా కొలువులు పొందారు. నాలుగో తరగతి ఉద్యోగుల్లో కొందరికి 60 ఏళ్లు దాటినా ఇంకా పనిచేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నాయి. జీవో నంబరు 2323 ప్రకారం పదవీ విరమణ పొంది గత ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన మరో ఇద్దరు ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ వర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు.
* ఓ వ్యక్తి పుట్టిన తేదీ 01.7.1990 కాగా.. 01.11.1998లో మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) కింద రాయలసీమ విశ్వవిద్యాలయంలో కొలువులో చేరారు. ఎనిమిదేళ్లకే తొమ్మిదో తరగతి చదివినట్లు ప్రధాన కార్యదర్శికి అందించిన వివరాల్లో ఉండటం ఒక ఎత్తైతే... 8 ఏళ్లకే కొలువులో చేరడం మరో విచిత్రం. కార్మిక చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారు పనిచేస్తుంటే బాల కార్మికులుగా గుర్తిస్తారు. పనిచేయిస్తున్న యజమానిపై కేసు నమోదు చేస్తారు. ఆర్‌యూలో మాత్రం ఈ నిబంధనలు వర్తించవా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
* ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు. ఆర్‌యూలో మాత్రం పదవీ విరమణ వయస్సు దాటినా కొనసాగుతూనే ఉన్నారు. ప్రతి నెలా వారికి వేతనం ఇస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. 50 ఏళ్లు దాటినా కొలువులు ఇచ్చేస్తున్నారు.