ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోయిన్​పల్లి కిడ్నాప్ కేసు: రూ.10 లక్షలకు కిడ్నాప్‌ ఒప్పందం

తెలంగాణ బోయిన్​పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసు.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే మాజీ మంత్రి అఖిలప్రియే ప్రధాన నిందితురాలని పోలీసులు తెల్చారు. కిడ్నాప్‌ సమయంలో ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి అక్కడే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. పలు కీలక సమాచారం లాబట్టినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.

hyderabad cp anjani kumar reveals that ex minister bhuma akhila priya is main victim in boinpally kidnap case
బోయిన్​పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు అఖిలప్రియేనని తేల్చిన పోలీసులు

By

Published : Jan 18, 2021, 10:31 AM IST

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియేనని పోలీసులు తేల్చారు. కిడ్నాప్‌ సమయంలో ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి అక్కడే ఉన్నట్లు గుర్తించారు. కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లోనే ప్రణాళిక రూపొందించినట్లు కీలక ఆధారాలు సేకరించారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, ఆమె అనుచరుడు గుంటూరు శ్రీను ఈ నెల 2, 4 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమైనట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదివారం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో వెల్లడించారు. కిడ్నాప్‌ చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో మరో 15 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరిందన్నారు. భార్గవ్‌రామ్‌ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌ల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కిడ్నాప్ కేసులో అరెస్టయిన నిందితులు

రూ.74 వేల అడ్వాన్సు
మాదాల సిద్ధార్థకు గుంటూరు శ్రీను తమ కిడ్నాప్‌ ప్రణాళికను చెప్పి, 20 మంది యువకులను సమకూర్చాలని కోరాడు. రూ.5 లక్షలు సిద్ధార్థకు, ఒక్కో యువకుడికి రూ.25 వేల చొప్పున ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నాడు. రూ.74 వేలు అడ్వాన్సుగా చెల్లించాడు. అందరికీ కూకట్‌పల్లి ఫోరంమాల్‌ సమీపంలోని ‘ఎట్‌ హోం’ లాడ్జిలో బస కల్పించాడు. యువకుల వేషాలకు అవసరమైన దుస్తులు కుట్టించాడు. మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌తో కలిసి ఆరు చవకరకం సెల్‌ఫోన్లు, బొమ్మ తుపాకీ, తాడు, ప్లాస్టర్లు తదితర వస్తువులను కొన్నాడు. భార్గవ్‌రామ్‌ 10 స్టాంపు కాగితాలను తెప్పించాడు. అయిదు తన పేరిట, మిగతావి జగత్‌విఖ్యాత్‌రెడ్డి పేరిట కొనుగోలు చేశాడు.


మధ్యాహ్నం నుంచే రెక్కీ..
ఈ నెల 5న మధ్యాహ్నం సంపత్‌, బాలచెన్నయ్య ద్విచక్ర వాహనంపై మనోవికాస్‌నగర్‌లోని బాధితుల ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. నిందితులంతా సాయంత్రం 4 గంటలకు లాడ్జి నుంచి యూసుఫ్‌గూడలోని ఎంజీహెచ్‌ పాఠశాలకు చేరుకొని, ఐటీ, పోలీస్‌ అధికారుల మాదిరిగా దుస్తులు ధరించారు. ప్రవీణ్‌రావు ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యులందరి చరవాణులు, ఇతరత్రా వస్తువులను లాగేసుకుని హాల్లో కూర్చోపెట్టారు. ప్రవీణ్‌కుమార్‌, నవీన్‌ కుమార్‌, సునీల్‌ కుమార్‌ కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కు కట్టేసి ఒక్కొక్కర్ని ఒక్కో కారులో ఎక్కించారు. మొయినాబాద్‌లోని భార్గవ్‌రామ్‌ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ కొట్టి బెదిరించి స్టాంపు కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో ఆ రోజు రాత్రి సన్‌సిటీ వద్ద బాధితుల్ని వదిలేసి పరారయ్యారు.


నకిలీ నంబర్లను కాగితంపై ముద్రించి..
కిడ్నాప్‌లో మొత్తం అయిదు కార్లను వినియోగించారు. కాగితంపై నకిలీ నంబర్లను ప్రింటవుట్‌ తీసి అన్ని కార్లకు అతికించారు. ఏపీ 21సీకే2804 ఇన్నోవాకు టీఎస్‌ 09బీజడ్‌ 9538 అనే నకిలీ నంబరును తగిలించారు. ఈ కారును భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి నడిపాడు. భార్గవ్‌రామ్‌ సహా మరో నలుగురు నిందితులు ఇందులోనే ఉన్నారు. ఈ కారు భార్గవ్‌రామ్‌ తల్లి కిరణ్మయి పేరిట రిజిస్టరై ఉంది. మరో 4 వాహనాలకు ఇలాగే నకిలీ నంబర్లు అంటించి మిగతా వారు అందులో వచ్చినట్లు సీపీ వెల్లడించారు.

అత్యధికులు కృష్ణా జిల్లా వారే
తాజాగా అరెస్టయిన నిందితులు.. మాదాల సిద్ధార్థ (29), బొజ్జగాని దేవప్రసాద్‌ (24), మొగిలి భాను (25), రాగోలు అంజయ్య (29), పదిర రవిచంద్ర (24), పచిగల్లి రాజా అలియాస్‌ చంటి (28), బానోత్‌ సాయి (23), దేవరకొండ కృష్ణ వంశీ (24), దేవరకొండ కృష్ణసాయి (24), దేవరకొండ నాగరాజు (25), బొజ్జగాని సాయి (23), కందుల శివప్రసాద్‌ (27), మీసాల శ్రీను (28), అన్నేపాక ప్రకాష్‌ (20), షేక్‌ దావూద్‌ (31). వీరిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందినవారు. వీరిలో సిద్ధార్థ కీలకంగా వ్యవహరించాడు. విజయవాడలో బౌన్సర్లను సరఫరా చేసే ఏజెన్సీ నడిపిన ఇతడి బృందంలోని యువకులను కిడ్నాప్‌లో వినియోగించాడు. భార్గవరామ్‌ అనుచరుడైన గుంటూరు శ్రీను పరిచయంతో ఈ వ్యవహారంలో తలదూర్చాడు. శ్రీను సహకారంతోనే అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటకశాఖ నిర్వహించే సభలు, ఇతర కార్యక్రమాలకు సిద్ధార్థ తన వద్ద ఉన్న యువకులను బౌన్సర్లుగా పంపి కమీషన్‌ తీసుకునేవాడని సమాచారం.

ఇదీ చదవండి:

కిడ్నాప్ కేసు: భార్గవరామ్ ఇంట్లో పథకం... 20 మంది 'గ్యాంగ్​'తో అమలు

ABOUT THE AUTHOR

...view details