Husband Killed Wife: అనుమానం పెనుభూతం అని పెద్దలు ఊరికే అనలేదు. ఒక్కసారి అది మనసులో నాటుకుపోతే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. తప్పు లేకపోయిన పరిస్థితులకు తలవంచక తప్పదు. మాటలు పడకా తప్పుదు. ఇంకొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవచ్చు. తప్పు లేదని నిరూపించుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసాలకు పాల్పడాలి. అది వివాహ బంధంలో అయితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పెళ్లై సంవత్సరాలు గడిచి అన్యోన్యంగా ఉంటున్న దంపతులకైనా.. పెళ్లి జరిగి నెలల గడిచిన వారికైనా ఒకటే విధంగా ఉంటుంది. తాజాగా కర్నూలు జిల్లాలో అనుమానం కారణంగా భార్యను ఓ భర్త అతికిరాతకంగా నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది.
పెళ్లై రెండు నెలలు గడిచిన ఆ యువతి.. విగతజీవిగా మారింది. కొత్త సంసారం కోసం ఎన్నో కలలు కన్న ఆమె.. అవి తీరకముందే తనువు చాలించింది. వివాహం జరిగిన దగ్గరి నుంచి ఎంతో హాయిగా సాగుతున్న పచ్చని సంసారంలో అనుమానం అనే ఓ పెనుభూతం రగిల్చిన చిచ్చులో ఆ వివాహిత అగ్నికి ఆహుతి అయ్యింది. పెళ్లి జరిగిన రెండు నెలలకే చిన్న చిన్న వివాదాలు, కాపురానికి రమ్మంటే రానని భార్య నిరాకరణ, అనుమానం కారణంగా భర్త.. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసినభార్యను అనంతలోకాలకుపంపించాడు. అలాగే భార్యతో పాటు ఆమె తల్లి ప్రాణాన్ని కూడా హరించాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కౌతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన మహాదేవి వాలంటీరుగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు కర్నాటక రాష్ట్రంలోని టెక్కలికోటకు చెందిన రమేష్తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. మహాదేవి తల్లి కూడా బాపూరం గ్రామంలో వీఆర్ఏగా పని చేస్తుంది. పెళ్లైన తర్వాత కాపురానికి కర్ణాటక రావాలని భార్యను కోరగా ఆమెకు అందుకు ఒప్పుకోలేదు. ఆ విషయంపై భార్యాభర్తలకు గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన భర్త.. అర్ధరాత్రి సమయంలో కర్రతో భార్యపై దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తపైనా దాడి చేశాడు. తల మీద తీవ్రంగా దెబ్బలు తగలడంతో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం రమేష్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దాయాదుల మధ్య వివాదం.. ఒకరు మృతి: ఇంటి స్థలం విషయంలో దాయాదుల మధ్య జరిగిన వివాదాంలో.. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. మేడికొండూరు సీఐ వాసు తెలిపిన కథనం మేరకు.. ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామానికి చెందిన మండవనేని వెంక టేశ్వర్లు(30), వరుసకు బాబాయ్ అయిన నాగేశ్వరరావు, అతని కొడుకు శ్రీకాంత్ మధ్య శనివారం రాత్రి ఇంటి స్థలం విషయంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ ఇనుప రాడ్ తీసుకొని వెంకటేశ్వర్లును కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి వెంకటేశ్వర్లు మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ వాసు, ఫిరంగీపురం ఎస్సై లక్ష్మీ నారాయణ రెడ్డితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లారు. మండవనేని శ్రీకాంత్, అతని తండ్రి నాగేశ్వరావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్, అతని తండ్రి నాగేశ్వరరావు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.