ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టణవాసులుపై పన్నుల భారం.. పెరగనున్నవి ఇవే..! - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కరోనా కష్టకాలంలో పట్టణవాసిపై పన్నుల మోత మోగనుంది. ప్రజలపై కనికరం చూపించాల్సిన ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపనుంది. సొంత ఇల్లు ఉన్నవారు అద్దెచెల్లించినట్లే.. ఇకపై పన్నులు చెల్లించాలి. ఈ ప్రభావం అద్దె ఇళ్లలో ఉండేవారిపై అధికభారం పడే ప్రమాదం లేకపోలేదు. ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన.. కొత్త చట్టాలు.. ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

house taxes on towns and municipalities
పట్టణవాసులుపై పన్నుల భారం

By

Published : Dec 26, 2020, 6:15 AM IST

కరోనా కారణంగా ఉపాధి లేక, ఉద్యోగాలు ఊడి.. పనులు దొరక్క ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బందులు పడుతున్నాయి. ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైంది. దీనిపై ఆధారపడిన ఎంతో మందికి పని లేదు. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇప్పుడే లభించే అవకాశాలూ కనిపించటం లేదు. ఇలాంటి తరుణంలో.. గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది.

పట్టణాలు, నగరాల్లో కనీస మౌలిక వసతులు కల్పించటం లేదన్న ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాం. శివారు ప్రాంతాల్లో.. రహదారులు, మంచినీరు, వీధిలైట్లు సహా డ్రైనేజీ వ్యవస్థ ఉండదు. చాలా కాలనీల్లో.. నీటి కోసం యుద్ధాలు జరుగుతుంటాయి. మురుగునీరు బయటకు వెళ్లక ఎక్కడికక్కడ దుర్గంధం వెదజల్లుతుంటుంది. మున్సిపల్ నీరు తాగలేక ఉదయాన్నే ప్రజలు క్యాన్లతో ఫిల్టర్ వాటర్ కోసం క్యూ కడుతుంటారు. కుక్కలు, పందులు సహా పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉంటుంది. రోడ్లు సరిగా ఉండవు. వీటిపై దృష్టిసారించని ప్రభుత్వం.. పన్నుల భారం వేసేందుకు మాత్రం ప్రణాళికలు రూపొందించింది.

భారం కానున్న ఆస్తిపన్ను:

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల సదుపాయాల యూజర్ ఛార్జీలను పెంచేసింది. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రజల నుంచే వసూలు చేయనున్నారు. కనీసం వీటి గురించి తెలియకముందే.. ఆస్తిపన్ను భారం మోపుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్నుకు బదులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నిర్ణయించిన ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీని కోసం 5 మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేస్తూ.. రూపొందించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ గత నెలలోనే ఆమోద ముద్ర వేశారు. కొత్త నిబంధనలను గెజిట్ లో నోటిఫై చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏప్రిల్ నెల నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుందని.. దానికి సిద్ధంగా ఉండాలని. మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

పట్టాణాల్లో పన్ను ఎలా లెక్కిస్తారో తెలుసా..?

ఇప్పటి వరకు ఒక నగరం లేదా పట్టణాన్ని ఒక జోన్​గా విభజించేవారు. ఆ జోన్ లోని నివాస, వాణిజ్య భవనాలకు ఎంత అద్దెలు వస్తాయో అంచనా వేసి.. చదరపు మీటరుకు ఇంత మొత్తమని నిర్ణయించి గెజిట్ లో నోటిఫై చేసేవారు. భవనం పొడువు X వెడల్పు ఆధారంగా దాని ఫ్లింత్ ఏరియాను నిర్ణయించేవారు. దాన్నిబట్టి ఏడాదికి ఎంత అద్దె వస్తుందో లెక్కించేవారు. దానిలో రెండొంతులు భవనం విలువగానూ, ఒక వంతు స్థలం విలువగానూ పరిగణించేవారు. భవనంలో దాని యజమానే నివసిస్తుంటే భవనం విలువలో 40 శాతం తరుగు తీసేసేవారు. అద్దెకు ఇచ్చినా, నివాసేతర అవసరాలకు వినియోగిస్తున్నా 10 శాతం తరుగు ఉండేది. తరుగుపోగా వచ్చిన భవనం విలువను, స్థలం విలువకు కలిపి వార్షిక అద్దె నిర్ణయించేవారు. ఆయా కార్పొరేషన్లు, పురపాలక సంస్థల్లో అమలులో ఉన్న పన్ను రేటు ఆధారంగా పన్ను మొత్తం ఖరారు చేసేవారు. ఉదాహరణకు ఈ పన్ను రేటు గుంటూరులో నివాస భవనాలకు 23.32 శాతం, వాణిజ్య భవనాలకు 30.33 శాతం ఉంది.

నివాస భవనాలకు దాని రిజిస్ట్రేషన్ విలువలో 0.10 శాతానికి తగ్గకుండా, 0.50 శాతానికి మించకుండా పన్ను వేస్తారు. వాణిజ్య భవనాలకు కనిష్ఠంగా 0.20 శాతంగానూ, గరిష్ఠంగా 2.0 శాతం పన్ను ఉంటుంది. ఈ పన్ను శాతం ఎంత ఉండాలన్నది స్థానిక నగరపాలక, పురపాలక సంస్థలే నిర్ణయించుకుంటాయి. ఒక నగరం లేదా పట్టణం మొత్తానికి పన్ను శాతం ఒకటే ఉంటుంది. నివాస భవనాలకు నిర్ణయించిన పన్ను శాతం, వాణిజ్య భవనాల కన్నా తక్కువే ఉండాలి.

పట్టణవాసులుపై పన్నుల భారం

ఇంటి స్థలాలకు విధించే పన్నుల వివరాలు:

కేవలం నివాస భవనాలు, వాణిజ్య భవనాలే కాదు.. ఇంటి స్థలాలకూ పన్నులు వేస్తారు. ఖాళీ స్థలాలకు పురపాలక సంస్థల్లో ఆస్తి విలువలో 0.20 శాతం పన్ను, కార్పొరేషన్లలో ఇంటి స్థలాలకు 0.50 శాతం పన్ను విధిస్తారు. ఆ స్థలాల్లో చెత్త, వ్యర్థాలు ఉంటే.. దాన్ని తొలగించే వరకు మున్సిపాలిటీల్లో 0.10 శాతం, కార్పొరేషన్లలో 0.25 శాతం చొప్పున అదనంగా జరిమానా విధిస్తారు. అద్దె ఆధారిత పన్ను విధానం నుంచి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానంలోకి మారే మొదటి సంవత్సరంలో పన్ను లెక్కించేటప్పుడు.. ప్రస్తుతం ఉన్న పన్నుని 15 శాతానికి మించి పెంచాల్సి వస్తే.. పెంపుదలను 15 శాతానికే పరిమితం చేస్తారు. 10-15 శాతం పెంచాల్సి వస్తే.. ప్రస్తుత పన్నుకి, కొత్త పన్నుకి మధ్య వ్యత్యాసం ఎంతుందో అంత పెంచుతారు. 10 శాతం వరకు పెంచాల్సి వస్తే.. 10 శాతం పెంచుతారు. ప్రస్తుత పన్ను, కొత్త పన్ను కంటే ఎక్కువగా ఉంటే.. దాన్ని తగ్గించరు. ప్రస్తుతం ఉన్నదాని మీద కనీసం 10 శాతం పెంచుతారు.

కొన్నింటికి మినహాయింపులు:

పేదల ఇళ్లు, ఇతర సంస్థలకు కొత్త విధానంలో కూడా పాత విధానాన్నే అనుసరిస్తారు. కొన్నింటికి మినహాయింపులు ఇవ్వనున్నారు. 375 చదరపు అడుగుల కంటే తక్కువ నిర్మితప్రాంతం కలిగిన ఇళ్లకు ఆస్తిపన్ను సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. ప్రార్థనా మందిరాలు, చౌల్ట్రీలు, కొన్ని విభాగాల విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల భవనాలు, స్మారక, సాంస్కృతిక కట్టడాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఆర్సీసీ, పెంకులు, రేకులు, నాపరాళ్లు, పూరిళ్లకు వర్గీకరణ ఆధారంగా ఆస్తిపన్ను విధించనున్నారు. ఆస్తి పన్ను నిర్ధారణలో అక్రమ కట్టడాలకు 25 నుంచి 100 శాతం వరకు జరిమానా విధిస్తారు.

ఆస్తి విలువ ఆధారంగా పన్నులు ..

పట్టణ స్థానిక సంస్థల్లో.. ‍ఐదేళ్లకు ఒకసారి పన్నులు సవరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో పలు సంవత్సరాలుగా ఆ ప్రక్రియ జరగలేదు. చివరిగా 2002 లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు పన్నులు సవరించారు. ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగా.. పన్నులు విధించటం వల్ల పన్నులు అనేక రెట్లు పెరగనున్నాయి.

రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనాభా కోటీ 60 లక్షలు- ప్రస్తుతం ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు 12 వందల కోట్లు- కొత్త పన్నుల ద్వారా ఆదాయం అంచనా 10 వేల కోట్ల రూపాయలు- కొత్త పన్నుల భారం 8 వేలా 8 వందల కోట్ల రూపాయలు

50 శాతం రాయితీ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం..

కరోనా కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రాబోయే రెండేళ్లలో.. 50 శాతం రాయితీ కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు కల్పించకుండా.. ఉన్న పన్నులను భారీగా పెంచి వేల కోట్ల రూపాయల పన్నుల భారం విధించటంపై ఏపీ పట్టణ పౌర సంఘాల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. డిసెంబర్ 28, 29 తేదీల్లో వార్డు సచివాలయాల ముందు ఆందోళనలు, జనవరి 6న పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయినా స్పందించకపోతే.. భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని సమాఖ్య హెచ్చరిస్తోంది.

ఇదీ చదవండి: ఈ జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ బిల్లుల 'మోత మోగదు'!

ABOUT THE AUTHOR

...view details