ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో పట్టపగలే తలపై బండరాయితో మోది దళిత యువకుడి హత్య

honour-killing-in-adoni-rtc-colony
ఆదోని ఆర్టీసీ కాలనీలో పరువు హత్య

By

Published : Dec 31, 2020, 7:14 PM IST

Updated : Jan 1, 2021, 6:53 AM IST

19:09 December 31

ఆదోని ఆర్టీసీ కాలనీలో పరువు హత్య

ఆదోనిలో హత్యా ఘటనపై మాట్లాడుతున్న మృతుడి భార్య

కర్నూలు జిల్లా ఆదోనిలో పరువు హత్య చోటుచేసుకుంది. పట్టపగలే ఓ దళిత యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన గురువారం సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం ఆదోనిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఆడమ్‌స్మిత్‌ (35) గురువారం మధ్యాహ్నం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై స్థానిక ఆర్టీసీ కాలనీలోని తమ ఇంటికి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. ఇనుప రాడ్లతో దాడిచేయడంతో స్మిత్‌ కింద పడిపోయారు. స్థానికులు హంతకులను అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పక్కనే ఉన్న బండరాయితో స్మిత్‌ తలపై మోది విచక్షణారహితంగా హత్యచేశారు. యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆడమ్‌స్మిత్‌ నందవరం మండలం గురజాలకు చెందిన చిన్న నాగన్న, సువార్తమ్మల మూడో కుమారుడు. అదే గ్రామానికి చెందిన చిన్న ఈరన్న, లక్ష్మిల కుమార్తె మహేశ్వరి, స్మిత్‌ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు 2020 నవంబరులో మహేశ్వరికి నిశ్చితార్థం చేశారు. డిగ్రీ చదివిన మహేశ్వరి నంద్యాలలో బ్యాంకు కోచింగ్‌కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి.. నవంబరు 12న ఆడమ్‌స్మిత్‌తో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుని కొన్ని రోజులు స్నేహితుల వద్ద ఉన్నారు. విషయం తెలుసుకున్న మహేశ్వరి కుటుంబసభ్యులు చంపేస్తామంటూ ఫోన్లో మూడుసార్లు హెచ్చరించారు.

ఊళ్లోకి రావద్దు.. వస్తే పరువు పోతుంది

అయినవారి హెచ్చరికలతో భయపడిన స్మిత్‌, మహేశ్వరి డిసెంబరు 1న కర్నూలు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి రక్షణ కల్పించాలని కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు తాలూకా సీఐ మంజునాథ్‌ రెండు కుటుంబాలనూ స్టేషన్‌కు పిలిపించారు. మహేశ్వరి తల్లిదండ్రులు తమ కుమార్తెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదు. తమతో ఎలుకల మందు తెచ్చుకున్న వారు.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. సీఐ వారికి నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్‌ చేశారు. ఈరన్న తన కుమార్తెను ఊళ్లోకి రావద్దని, ఇద్దరూ కలిసి వస్తే పరువు పోతుందన్నారు. తాము ఉద్యోగరీత్యా వేరేచోట ఉంటామని, గురజాలకు రాబోమని నవదంపతులు చెప్పడంతో అమ్మాయి బంధువులు వెనక్కితగ్గి గ్రామానికి వెళ్లిపోయారు.

సద్దుమణిగిందని అనుకునేలోగా..

మహేశ్వరి, ఆడమ్‌స్మిత్‌ ఆ వెంటనే ఆదోనికి వచ్చి ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులు శాంతించడంతో.. ఇక తమకు భయం లేదని భావించి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. అలాంటిది కొద్దిరోజుల వ్యవధిలోనే భర్తను హత్య చేయడంతో మహేశ్వరి శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మృతదేహంపై పడి ఆమె రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తన తండ్రి చిన్న ఈరన్న, పెద్దనాన్న పెద్ద ఈరన్నలే తన భర్తను హత్యచేశారని మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సహా ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వినోద్‌ తెలిపారు.

నన్ను క్షమించండి మావయ్యా..

కుమారుడి మృతదేహాన్ని చూసి స్మిత్‌ తండ్రి నాగన్న ‘తక్కువ కులం అనే మా అబ్బాయిని చంపేశారు’ అంటూ రోదించారు. ‘నన్ను క్షమించండి మావయ్యా’ అంటూ ఆయన కాళ్లు పట్టుకుని మహేశ్వరి వేడుకున్నారు. విధులు ముగించుకుని నూతన సంవత్సర వేడుకల కోసం కేక్‌ కొనుగోలు చేసి స్మిత్‌ తీసుకెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకోవడంతో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి:ఆదోనిలో వైద్యుడి హత్య.. ప్రేమ వివాహమే ప్రాణం తీసిందా!

Last Updated : Jan 1, 2021, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details