ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదిలిస్తే హాహాకారం.. ప్రాజెక్టుల వద్ద తేనెటీగల బెడద - జలాశయాలపై తెనెటీగల బెడద

తియ్యని మకరందం పంచే తేనెటీగలు తేడా వస్తే అంతు చూస్తాయి. వ్యక్తులు, జంతువులపై ఉమ్మడిగా దాడి చేసి ప్రాణాపాయం కల్గిస్తాయి. కీటకాలన్నీ తమ గూళ్లను దూకుడుగా కాపాడుకుంటాయి. ఎవరైనా తమ ఉనికి ఆటంకం కల్గిస్తే ఉమ్మడిగా దాడి చేస్తాయి. వరదల సమయంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి, దించేటప్పుడు ప్రతిసారీ తేనెటీగల దాడి తప్పడం లేదు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్ వద్ద ఇదే పరిస్థితి

honey bee problems at water projects in karnool
జలశయాల వద్ద తెనెటీగల బెడద

By

Published : Sep 25, 2020, 2:30 PM IST

తేనెటీగల దాడితో రిజర్వాయర్ల వద్ద విధులు నిర్వహించాలంటేనే ఇంజినీర్లు హడలెత్తుతున్నారు. ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, బనకచర్ల సముదాయం వద్ద తుట్టెలు భారీగా ఏర్పాటు చేశాయి. గేట్ల నిర్వహణకు అరకొర నిధులు కేటాయిస్తున్నారే తప్ప తేనె తుట్టెలపై దృష్టి సారించడం లేదు. అదేమంటే నిర్వహణ పనుల్లో తేనెటీగను తొలిగించాలన్న నిబంధనేమీ లేదంటూ చేతులు దులుపుకొంటున్నారు. ఇంజినీర్లు గేట్లు ఎత్తి, దించేటప్పుడు సిగరెట్‌ పొగ పీల్చి, వదిలినా, ఘాటైన శానిటైజర్లు, ఫర్‌ఫ్యూమ్‌లు వాడినా ఆ వాసనకు పైకి లేచి దాడి చేస్తున్నాయి. వరదల సమయంలో గేట్లు ఎత్తి, దించేటప్పుడు ప్రతిసారీ తేనెటీగల దాడి తప్పడం లేదు.

తేనెటీగలు కుట్టే లక్షణాలు ఇలా..

● అన్ని రకాల తేనెటీగలు తమ ఉనికికి ఆటంకం కల్గిస్తే దాడి చేస్తాయి.

● పని ఈగలు, ఆడ ఈగలు లేదా రాణి ఈగలు దాడి చేయడంలో ముందు ఉంటాయి.

● పుప్పొడి కోసం వెళుతున్న ఈగలు కుట్టవు.

● తాము నివాసం ఉంటున్న తుట్టెకు ప్రమాదం కల్గించినపుడు దాడి చేస్తాయి.

● తేనెటీగ స్టింగర్‌ కొండి ముళ్లలాగా ఉండి మూడు భాగాలుగా ఉంటుంది.

● మనిషి, ఇతర జంతువుల చర్మం మందంగా ఉంటాయి. ఈగ కుట్టినపుడు బాధితుడి చర్మంలోకి కొండి మొదటి భాగం పోయి ఇరుక్కు పోతుంది. ఈ కొండిని బయటికి తీసుకోవడానికి ఈగ విపరీతంగా ప్రయత్నిస్తుంది.

● ఈ ప్రయత్నంలో ఈగ ఉదర భాగంపై ఒత్తిడి పెరిగి పొట్ట పగిలి చనిపోతుంది. చనిపోయిన ఈగ నుంచి ఈ దశలో ప్లైరోమోన్‌ అనే హర్మోన్‌ విడుదల అవుతుంది.

● ఈ హార్మోన్‌ అలారం లాగా పని చేస్తుంది. ఫిరమోన్‌ వాసన అంతా వ్యాపిస్తుంది. ఈ వాసనను గుర్తించి మిగతా తేనెటీగలు లేచి ఉమ్మడిగా వ్యక్తులపై దాడి చేస్తాయి.

● సాధారణంగా బాధితుడు పారిపోతున్నా, జనంలో కలిసి పోయినా వదిలిపెట్టవు.

● బాధితుడు నీటిలో దూకినా, బయటకు వచ్చినా వెంటనే తిరిగి దాడి చేస్తాయి.

● తేనెటీగలు, కందిరీగలు ఒకే రకమైన కీటక జాతికి చెందినవి.

శరీరంపై వివిధ ప్రదేశాలల్లో ప్రభావం ఇలా..

● తలపై ఎక్కువగా కుడితే వెంటనే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

● నరాలపై కుడితే చలనం కోల్పోతారు.

● కండరాలపై ఎక్కువగా దాడి చేస్తే బీపీ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుని అపస్మారక స్థితిలోకి వెళతారు.

తీసు కోవాల్సిన జాగ్రత్తలు

● వీలైనంత త్వరగా శరీరంలో చిక్కుకున్న కొండీలను తొలగించాలి

● షాక్‌ నుంచి తేరుకునేందుకు వ్యక్తిని అప్రమత్తం చేస్తూ ఉండాలి.. వెంటనే ఆ ప్రదేశం నుంచి సాధ్యమైనంత దూరం వెళ్లిపోవాలి

● వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలి

కుట్టిన ప్రభావం.. ఇలా..

● అలర్జ్జీ ఉన్న వ్యక్తులను ఇవి కుడితే విషం వేగంగా శరీరం అంతా వ్యాపిస్తుంది.

● తేనెటీగ కుట్టినప్పుడు విడుదలైన విషంలో డోపమైన్‌, హిస్టమైన్‌, న్యూరోటాక్సిన్‌, ఎంజిమస్‌, టాక్సిక్‌ పెప్టిదడెస్‌ కల్గి ఉంటాయి.

● ముఖం, గొంతు, మెడ, పెదవులపై ఎక్కువసార్లు కుడతాయి.

● రెండు నిమిషాల తరువాత చర్మంపై వాపు వస్తుంది. ఆరు నిమిషాల తరువాత నొప్పి వస్తుంది. ఎర్రబారటం తిమ్మిర్లు వస్తాయి.

● 27 నిమిషాల తర్వాత చెమటలు పడతాయి.

● విష ప్రభావంతో నరాలు, కండరాల నొప్పులు వస్తాయి.

● ఊపిరి సరిగ్గా తీసుకోలేక పోవటం.. ఆయాసం రావటం, వాంతులు కావటం, సృహ కోల్పోవడం జరుగుతుంది. గొంతు వాపు వస్తుంది.

● సరైన చికిత్స అందకుంటే 15 నిమిషాల నుంచి 2 గంటలలోపు వ్యక్తి మృత్యువాత పడే అవకాశం ఉంది.

జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు

1) ఈనెల 22న బనకచర్ల నీటి సముదాయం వద్ద తేనెటీగల దాడిలో ఎస్‌ఆర్‌బీసీ డీఈ భానుప్రకాశ్‌ మృతి చెందారు.

2) పాములపాడుకు చెందిన కౌలురైతు దిగువపాటి నారాయణ తేనెటీగల దాడిలో మృత్యువాత పడ్డారు. కొన్నేళ్ల క్రితం మిడుతూరులో పుల్లయ్య, నందికొట్కూరుకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి తేనెటీగల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

3) గతంలో సాగునీటి వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే ఆర్థర్‌ జిల్లా అధికారులపై బనకచర్ల నీటి సముదాయం వద్ద తేనెటీగలు దాడి చేశాయి. ఘటనా స్థలం నుంచి పరుగులు తీసి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద నడక వంతెన

కింద తేనెతుట్టెలు

తేనెటీగలు దాడి చేయడంతో ఉరుకులు పరుగులతో దిగుతున్న

మంత్రి అనిల్‌ కుమార్‌ తదితరులు

ఇదీ చదవండి:రేపటి నుంచి ద్వారకా తిరుమలలో కల్యాణ మహోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details