రాయలసీమ జిల్లాల్లో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గతనెల చివరి నాటికి కర్నూలు జిల్లాలో ఎండలు 40 డిగ్రీలకు చేరడం.. ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ ఆరంభం నుంచి భానుడు చూపిస్తున్న ఉగ్రరూపానికి.. ఇళ్లలో ఉక్కపోత అధికంగా ఉంటోంది. ఏసీలు, కూలర్లు లేకుండా ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.
కర్నూలు నగరంలో ఇప్పటి వరకు అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ప్రస్తుతం 3 నుంచి 4 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దానికి తోడు వడగాలులూ వీస్తున్న కారణంగా.. ప్రజల బాధలు వర్ణనాతీతం అవుతున్నాయి. చీకటి పడినా వేడిగాలులు చల్లబడటం లేదు. రాత్రి వేళల్లోనూ 28 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.