Temperature Raise In AP : ఎండలు బాబోయ్.. ఎండలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా పొడి వాతావరణం నెలకొంది. ఉష్ణ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో అన్ని చోట్లా సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మహారాష్ట్రలోని విదర్భ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని, సముద్ర మట్టానికి 1 కిలో మీటరు ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, రాగల రెండు, మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు : చిత్తూరు 43.84 డిగ్రీలు, తాడేపల్లి గూడెం 43.3, ప్రకాశం జిల్లా 43.1, ధవళేశ్వరం 43, నంద్యాల 43, తిరుపతి 42.7, పశ్చిమ గోదావరి జిల్లా 42.5, సిద్ధవటం 42.42, ఎన్టీఆర్ 42.35, నెల్లూరు 42.33, కోనసీమ జిల్లా 42, మంత్రాలయం 42, ఏలూరు 41.85, కర్నూలు 41.75, విజయవాడ 40.3, తిరుపతి 40.8, కడప 42.7 గా నమోదు అయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది.