కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం నోటీసులిచ్చింది తెలిసీ ఎందుకు స్పందించలేదని నిలదీసింది. తితిదే బోర్డు పాలక మండలి సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో రాంభూపాల్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీచేసిన విషయాన్ని పత్రికల ద్వారా ప్రకటన ఇవ్వాలంటూ ఈనెల 4న ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్ తీసుకోవాలంటూ వేసిన అనుబంద పిటిషన్‌పై విచారణ జరపాలని ఎమ్మెల్యే తరపు న్యాయవాది కోరడంతో తీవ్రంగా స్పందించింది. గతంలో న్యాయస్థానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసినప్పటికీ ఎందుకు స్పందించలేదని నిలదీసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
పాణ్యం ఎమ్మెల్యే కాటసానిపై హైకోర్టు ఆగ్రహం - hc fires on panyam mla katasi ram bhupal reddy
పాణ్యం ఎమ్మెల్యే కాటసానిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది.
ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు?
ఎమ్మెల్యే అయి ఉండి అందుబాటులో లేరంటూ.. నోటీసులు అందుకోకపోతే పత్రికల్లో పేరు ప్రచురించేందుకు ఆదేశించకుండా ఏమి చేయమంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పి ఏమి ప్రయోజనం అని పేర్కొంది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా కోర్టు ఇచ్చిన నోటీసును ఎలా నిరాకరిస్తారని నిలదీసింది. మీ తీరు ఆ విధంగా ఉంటే పత్రికల్లో పేర్లు ప్రచురించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు వెనక్కి తీసుకోవాలని ప్రశ్నించింది. గతంలో హైకోర్టు తితిదే బోర్డు సభ్యులైన ప్రతివాదులందరికి నోటీసులు ఇచ్చిన విషయం పత్రికల్లో విస్తృతంగా ప్రచురితం అయిందని గుర్తు చేసింది. ఎమ్మెల్యే తరపు న్యాయవాది బదులిస్తూ.. ఆ సమయంలో కుమారుడి వివాహం ఉందన్నారు. నోటీసుపై స్పందించనందుకు క్షమాపణలు కోరుతున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ..వివాహ పనుల కారణంగా న్యాయవాదిని సంప్రదించలేకపోయారా అని ప్రశ్నించింది. అంటే దాని అర్థం కోర్టు నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసని పేర్కొంది. ఎమ్మెల్వేనే నోటీసులు నిరాకరిస్తే ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. న్యాయాలయం ఆదేశాలపట్ల కనీస గౌరవం ప్రదర్శించని వ్యక్తి తితిదే బోర్డు సభ్యునిగా నియమితులై దేవాలయం పట్ల భక్తితో మెలుగుతారని ఎలా భావించగలం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతిమంగా న్యాయవాది అభ్యర్థన మేరకు రీకాల్ పిటిషన్‌పై విచారణ చేసేందుకు అంగీకరించింది. నేర చరిత్ర, రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న 18 మందిని తితిదే పాలక మండలి సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాఖ్యంలో కోర్టు నోటీసులు అందుకోని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి , మరో ఇద్దరి విషయంలో పత్రికల్లో ప్రకటనల ద్వారా నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిది తితిదే మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి.భాను ప్రకాశ్ రెడ్డిని ఈనెల 4 న హైకోర్టు ఆదేశించింది.