ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. గురుకులాల్లో 11 వేల పోస్టులు - బీసీ గురుకులాల్లో పోస్టులు

Gurukul School Job Recruitment: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కలిపి.. ఒకేసారి 11 వేలకుపైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రిమండలి ఆమోదించిన 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి కోసం బోర్డు ఎదురుచూస్తోంది.

Gurukul School Job Recruitment
Gurukul School Job Recruitment

By

Published : Jan 3, 2023, 1:11 PM IST

Gurukul School Job Recruitment: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కలిపి త్వరలోనే ఒకేసారి 11 వేలకు పైగా పోస్టులకు కలిపి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని గురుకుల నియామకబోర్డు నిర్ణయించింది. ఈ ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రిమండలి ఆమోదించిన దాదాపు 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ముందస్తు కసరత్తు పూర్తిచేసింది.

సంక్షేమశాఖల వారీగా ప్రతిపాదనలు పరిశీలించిన బోర్డు, బీసీ గురుకులాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అదనపు పోస్టులకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం.

Job Recruitment in Gurukul Schools : ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రతిపాదనలు నియామక బోర్డుకు పంపించేలా బీసీ గురుకుల సొసైటీ ఇప్పటికే రోస్టర్‌, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను గుర్తింపు పూర్తిచేసింది. ఈనెల రెండో వారంలో ప్రకటన జారీ చేయాలని గురుకుల బోర్డు భావిస్తోంది. సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే 9,096 పోస్టులను మంజూరు చేసింది. అదనపు పోస్టులతో కలిపి ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఇవి వెలువడిన తరువాత కనీసం మూడు నెలల సమయం ఉండేలా బోర్డు జాగ్రత్తలు పడుతోంది.

గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు రెండు, ఆపైన పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో అన్ని పోస్టులకు సన్నద్ధమై, పరీక్షలు రాసేలా షెడ్యూలు రూపొందించనుంది. ఉద్యోగ ప్రకటనలు ఒకేసారి ఇచ్చినప్పటికీ తొలుత పై నుంచి దిగువ స్థాయి పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల ఫలితాల్లోనూ తొలుత ఉన్నత స్థాయి పోస్టులకు వెలువరించి, ఆ పోస్టుల నియామకాలు పూర్తయిన తరువాత దిగువ స్థాయి పోస్టుల ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా గురుకులాల్లో ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి

బీసీ గురుకులాల్లో పోస్టులు ఎక్కువ :సంక్షేమ గురుకులాల్లో నియామకాలకు రెండు నెలల క్రితమే ప్రకటన వెలువరించాలని బోర్డు భావించింది. అయితే ఖాళీ పోస్టులన్నింటినీ గుర్తించి, ఒకేసారి ప్రకటన ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన బీసీ గురుకులాల్లో 2,591 వేలకు పైగా పోస్టులను గుర్తించి ప్రతిపాదనలకు సీఎం, మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో బీసీ గురుకులాల్లో అప్పటికే ఆమోదించిన పోస్టులు 3,870తో కలిపి అత్యధికంగా 6,461 పోస్టులు రానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖలో 2,267, గిరిజన సంక్షేమశాఖలో 1,514, మైనార్టీ సంక్షేమశాఖలో 1,445 పోస్టులు భర్తీ కానున్నాయి.

నేడు మహిళ, శిశు సంక్షేమాధికారి పోస్టులకు రాతపరీక్ష :మహిళాశిశు సంక్షేమశాఖలో 23 మహిళ, శిశు సంక్షేమాధికారుల పోస్టులకు మంగళవారం (ఈనెల 3)న కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు 19,812 మంది దరఖాస్తు చేయగా, ఇప్పటికే 13,954 మంది ధ్రువీకరణ పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 75 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

పేపర్‌-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని వివరించారు. పేపర్‌-1 పరీక్షకు ఉదయం 8.30 నుంచి 9.15 గంటల వరకు, పేపర్‌-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 1.45 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్‌ ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని చెప్పారు. ఎవరైనా ఎలక్ట్రానిక్‌ పరికరాలతో పరీక్ష కేంద్రంలోకి వచ్చినట్లు గుర్తిస్తే వారిని డీబార్‌ చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details