కర్నూలు జిల్లాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. కర్నూలు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరయ్యారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలోని రక్తదాన శిబిరం ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు... ఇప్పుడు పెద్దపెద్ద వైద్యులుగా ఎదిగారని ప్రశంసించారు.
దేశ, విదేశాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజం పట్ల వైద్యుల బాధ్యతను గుర్తుచేశారు. లక్ష్మణుడిని బతికించడానికి సంజీవిని రహస్యం చెప్పిన వైద్యుడు విభీషణుడు అంటూ... రామాయణ గాథను ఉటంకించారు. వైద్యులు దేవుళ్లతో సమానమన్న గవర్నర్... పేదలకు సేవ చేసేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
కర్నూలు వైద్య కళాశాల ఎంతో మంది గొప్ప వైద్యులను అందించిందని గవర్నర్ పేర్కొన్నారు. అంకాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నోరి దత్తాత్రేయుడు, గ్యాస్ట్రో ఎంటరాలజీలో ప్రపంచస్థాయి నిపుణుడు డి.నాగేశ్వరరెడ్డి సహా మరెంతో మంది వైద్యులు... రోగులకు నిబద్ధతతో సేవ చేస్తున్నారని కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ వైద్యవృత్తిని ప్రేమించేవారన్న గవర్నర్... పేదలకు సేవ చేసేందుకు వైద్యుడు కావాలనుకున్నారు.